కూతుళ్ల పై రజినీ ప్రేమ.. మూల్యం పెద్దదే

సూపర్ స్టార్ రజినీకాంత్‌ నట వారసత్వాన్ని కొనసాగించానికి కొడుకులు లేరు. కూతుళ్లకు నటన మీద కంటే దర్శకత్వం మీదే ఆసక్తి. ఐతే వాళ్ల కోసం కుటుంబ కథానాయకులు రిస్క్ చేసి మరీ సినిమాలు చేస్తున్నారు కానీ.. ఏదీ వర్కవుట్ కావడం లేదు. ముందుగా రజినీ పెద్ద కూతురు ఐశ్వర్య రాజేష్.. తన భర్త ధనుష్‌ను హీరోగా పెట్టి ‘3’ అనే సినిమా తీసింది.

కొలవెరి పాట కారణంగా ఈ సినిమా విడుదలకు ముందే బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఆమె తమిళంలో ఇంకో సినిమా తీసింది. అది ఒక మోస్తరుగా ఆడింది. చాలా గ్యాప్ తర్వాత ఐశ్వర్య తన తండ్రినే ప్రధాన పాత్రలో పెట్టి ‘లాల్ సలాం’ తీసింది. ఇందులో రజినీది దాదాపు ముప్పావుగంట ఉండే పాత్ర. రజినీ సినిమా అంటే మామూలుగా హైప్ వేరే స్థాయిలో ఉంటుంది. కానీ టైటిల్ సహా ఏదీ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించకపోవడంతో రిలీజ్ ముంగిట సినిమాకు బజ్ రాలేదు. 

తెలుగులో అయితే రజినీ సినిమా రిలీజవుతున్న సంగతి కూడా జనాలకు తెలియని పరిస్థితి. విడుదల తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. బ్యాడ్ టాక్ తెచ్చుకున్న ‘లాల్ సలాం’ వీకెండ్ కంటే ముందే వాషౌట్ అయిపోయింది. తమిళంలో ఓపెనింగ్స్ పర్వాలేదు కానీ.. సినిమాకు లాంగ్ రన్ ఉండేలా కనిపించడం లేదు. అక్కడ కూడా సినిమా ఫ్లాప్‌గానే నిలిచేలా ఉంది.

రజినీకి చిన్న కూతురు సౌందర్యతోనూ చేదు అనుభవమే ఉంది. ఆమె ఆయన్ని హీరోగా పెట్టి ‘కోచ్చడయాన్’ అనే యానిమేషన్ మూవీ చేసింది. అది నిర్మాతలు, బయ్యర్లకు దారుణమైన నష్టాలు మిగిల్చింది. ఆమె ఆ తర్వాత తన బావ ధనుష్‌ను పెట్టి ‘వీఐపీ’ సీక్వెల్ తీసింది. అది కూడా నిరాశపరిచింది. మొత్తంగా రజినీ కూతుళ్ల దర్శకత్వ ఆశలేమో కానీ.. వాళ్ల సినిమాలను నమ్ముకున్న వాళ్లందరికీ దారుణమైన నష్టాలు తప్పట్లేదు.