గత ఏడాది జైలర్ రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్నాక సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. అదే ఉపులో కూతురు అడగ్గానే లాల్ సలామ్ చేయడం, అదేమో బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం చకచకా జరిగిపోయాయి. ఇలాంటి జయాపజయాలు నూటా డెబ్భై సినిమాల సుదీర్ఘ అనుభవంలో ఎన్నో చూశారు కాబట్టి వాటిని పట్టించుకోవడం లేదు కానీ అభిమానులు ఆలా కాదుగా. ఫ్లాపులను పర్సనల్ గా తీసుకుంటారు. ఈ ఫలితానికి బాధ్యురాలిగా ఐశ్వర్య రజనీకాంత్ ని సోషల్ మీడియా వేదికగా గట్టిగానే నిలదీస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వద్దాం.
ఏడు పదుల వయసులోనూ రజని దూకుడు అలాగే కొనసాగుతోంది. టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వేట్టయాన్ షూటింగ్ ముగింపుకి దగ్గర్లో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో రేపటి నుంచి కొత్త షెడ్యూల్ మొదలుపెడతారు. ఇంకో నెల రోజుల్లో మొత్తం పూర్తి కావొచ్చని యూనిట్ టాక్. అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాసిల్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉన్నా ఇంత వేగంగా పరుగులు పెట్టించడం విశేషమే. తెలుగులో వేటగాడు టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఫిలిం ఛాంబర్ లో వేరే నిర్మాత పేరు మీద ఆల్రెడీ రిజిస్టరయ్యిందని టాక్.
ఇదవ్వగానే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ప్యాన్ ఇండియా మూవీ కోసం రజనీకాంత్ రెడీ అవుతారు. ఈలోగా చర్చల దశలో ఉన్న ఇంకో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది. డెబ్భై దాటాక మాములుగా నడవటమే కష్టమనుకునే పరిస్థితుల్లో సూపర్ స్టార్ ఇంతగా కష్టపడటం నిజంగా స్ఫూర్తినిచ్చేదే. మన దగ్గర చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సిక్స్ టీ ప్లస్ లోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. ఇంకోవైపు పెద్ద మార్కెట్ ఉన్న స్టార్లేమో రిస్కులు వద్దనుకుని నిదానమే ప్రధానం సూత్రం పాటించడంతో ఏడాదికి ఒక రిలీజ్ ఉండటం కూడా మహా కష్టమైపోయింది.