ఓవ‌ర్ టు భైర‌వ‌కోన‌

సంక్రాంతి త‌ర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ డ‌ల్లుగానే న‌డుస్తోంది. త‌ర్వాతి రెండు వారాలు కొత్త సినిమాల రిలీజే లేదు. ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో బోలెడ‌న్ని సినిమాలు వ‌చ్చాయి కానీ.. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మాత్ర‌మే కొంత సంద‌డి చేసింది.

ఇక ఈ వారం నాలుగు సినిమాలు రిలీజ‌య్యాయి. అందులో రెండు స్ట్రెయిట్‌వి, రెండు డ‌బ్బింగ్. ముందుగా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ‌యోపిక్ యాత్ర‌-2 విష‌యానికి వ‌స్తే అది పెద్ద‌గా ఇంపాక్ట్ వేయ‌లేక‌పోయింది. తొలి రోజు ఓపెనింగ్స్ ప‌ర్వాలేదు. కానీ రెండో రోజు నుంచి సినిమా పూర్తిగా డౌన్ అయిపోయింది. శుక్ర‌వారం మంచి అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ర‌వితేజ సినిమా ఈగ‌ల్ డివైడ్ టాక్ తెచ్చుకుంది. వ‌సూళ్లు ఓ మోస్త‌రుగా ఉన్నాయి. వీకెండ్ వ‌ర‌కు బండి న‌డ‌వొచ్చు. త‌ర్వాత క‌ష్ట‌మే. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ స్పెష‌ల్ రోల్ చేసిన అనువాద చిత్రం లాల్ స‌లాం ప‌ట్ల ముందు నుంచి ఆస‌క్తి లేదు. రిలీజ్ రోజు కూడా ఈ సినిమాకు స్పంద‌న అంతంత‌మాత్ర‌మే. టాక్ కూడా బాలేక‌పోవ‌డంతో సినిమా వాషౌట్ అయిన‌ట్లే క‌నిపిస్తోంది.

ఇక బేబి మేక‌ర్స్ రిలీజ్ చేసిన డ‌బ్బింగ్ మూవీ ట్రూ ల‌వ‌ర్ కూడా యావ‌రేజ్ టాకే తెచ్చుకుంది. బేబికి ద‌రిదాపుల్లో కూడా ఈ సినిమా నిలిచేలా లేదు. మొత్తంగా ఈ వీకెండ్ సినిమాల్లో ఏదీ బ‌లంగా నిల‌బ‌డే ప‌రిస్థితి లేదు. వారాంతం అయ్యాక బాక్సాఫీస్ డ‌ల్ అయిపోయేలా క‌నిపిస్తోంది. దీంతో ఇక ఫోక‌స్ మొత్తం వ‌చ్చే వారం రానున్న ఊరుపేరు భైర‌వ‌కోన సినిమా మీదే నిల‌వ‌నుంది. ఆ సినిమాకు మంచి హైప్ ఉంది. రిలీజ్ టైమింగ్ కూడా దానికి బాగానే కుదిరింది. సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న టీం రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియ‌ర్స్ వేయ‌బోతుండ‌డం విశేషం.