ఒకప్పుడు బాలకృష్ణ, రవితేజ, నాగార్జున, నితిన్ లాంటి స్టార్ల సరసన నటించిన ప్రియమణికి చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్లు పడకపోవడంతో కెరీర్ లో త్వరగానే బ్రేక్ వచ్చింది. అడపాదడపా ఇతర భాషల్లో ఆఫర్లు వస్తున్నా సక్సెస్ మాత్రం దోబూచులాడుతూ వచ్చింది. కానీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సక్సెస్ ఒక్కసారిగా తన గ్రాఫ్ ని అమాంతం పెంచేసింది. మనోజ్ బాజ్ పాయ్ భార్యగా కథలో కీలకంగా వ్యవహరించే పాత్ర కావడంతో నార్త్ ఆడియన్స్ కి దగ్గరయింది. తెలుగులో ఓటిటి మూవీ భామా కలాపం సూపర్ హిట్ కావడం ఏకంగా దానికి సీక్వెల్ తీసేందుకు ప్రేరేపించింది.
ఇంత సీనియారిటీ వచ్చాక ప్రియమణి డిమాండ్ పెరగడం అనూహ్యం. ఇటీవలే మోహన్ లాల్ నేరులో చేసిన లాయర్ పాత్ర మంచి పేరు తీసుకొచ్చింది. గతంలో నారప్పలో వెంకటేష్ సరసన నటించింది. ఆ తర్వాత విరాట పర్వంలో ఓ కీలక పాత్ర దక్కింది. షారుఖ్ ఖాన్ జవాన్ విజయం నెక్స్ట్ లెవెలని చెప్పాలి. ఇవన్నీ ప్రియమణి వల్ల హిట్టయ్యాయని చెప్పడం కాదు కానీ వాటిలో భాగం కావడం తనకు ప్లస్ అవుతోంది. త్వరలో విడుదల కాబోతున్న ఆర్టికల్ 370లో యామీ గౌతమ్ తో పాటు ముఖ్యమైన క్యారెక్టర్ దక్కించుకుంది. కొటేషన్ గ్యాంగ్ అనే మరో తమిళ సినిమా నిర్మాణం పూర్తి చేసుకుంది.
నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఇంత డిమాండ్ ఉండటం అనూహ్యమే. సినిమాలేమో కానీ ఓటీటిల తాకిడి పెరిగాక తనలాంటి ఆర్టిస్టులకు అవకాశాలు పెరిగాయి. దానికి తగ్గట్టే అవి కనక పేరు తెచ్చుకుంటే ఆఫర్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. ప్రియమణి వాటిని క్యాష్ చేసుకునే పనిలో ఉంది. భామా కలాపం 2ని ఫ్రీగా థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో త్వరలోనే షోలుంటాయి. ఆ తర్వాత ఓటిటిలో వచ్చేస్తుంది. ఇది తనకు మరింత పేరు తెస్తుందని చెబుతోంది. మూడు నాలుగు భాషల్లో రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించి ఖాళీ లేకుండా చూసుకుంటోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates