కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు వెంకటేష్ మహా. సహజమైన వాతావరణంలో.. సహజమైన పాత్రలతో.. అంత సహజంగా భావోద్వేగాలను పండించే సినిమాలు తెలుగులో చాలా అరుదు. ఇలాంటి సినిమాలు తమిళ, మలయాళ, బెంగాలీ డైరెక్టర్లు మాత్రమే తీయగలరు అనే అభిప్రాయం తప్పని రుజువు చేస్తూ కేరాఫ్ కంచరపాలెంతో తెలుగు సినిమా ప్రత్యేకతను చాటాడతను.
ఈ సినిమా తర్వాత వెంకటేష్ మీద అంచనాలు పెరిగాయి. కానీ తొలి సినిమా తర్వాత ఇప్పటిదాకా మళ్లీ అతను ఒరిజినల్ కథతో సినిమా తీయలేదు. దర్శకుడిగా రెండో చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ రీమేక్ మూవీ కాగా.. అతడి ప్రొడక్షన్లో వచ్చిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ సైతం తమిళ రీమేకే. మధ్యలో మర్మాణువు అనే సినిమా అనౌన్స్ చేశాడు కానీ.. అది ఏమైందో అతీ గతీ లేదు.
ఐతే వెంకటేష్ మహా మళ్లీ తన సొంత కథతో ఒక పేరున్న హీరోను పెట్టి సినిమా తీయబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు.. సందీప్ కిషన్. త్వరలోనే ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రంతో పలకరింకబోతున్నాడు సందీప్. చాలా ఏళ్లుగా హిట్టు లేని సందీప్.. ఈ చిత్రం మీదే భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రోమోలు చూస్తే అది హిట్టయ్యే సినిమాలాగే కనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సందీప్.. తాను వెంకటేష్ మహా దర్శకత్వంలో నటించబోతున్నట్లు వెల్లడించాడు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందట.
వెంకటేష్ ఈసారి తన సొంత కథతోనే సందీప్ హీరోగా సినిమా తీయబోతున్నాడట. ఒక పేరున్న నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రాబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates