తెర మీద తన పాత్రల్ని చూస్తేనే భయపడే స్థాయిలో విలనిజం పండించిన నటుడు.. ఆ తర్వాత ఆయన పాత్రల్ని చూడగానే నవ్వు ఆపుకోలేని స్థాయిలో నవ్వించడం అన్నది అరుదైన విషయం. జయప్రకాష్ రెడ్డికే సొంతమైన నైపుణ్యం ఇది. తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలతో కొత్త ఒరవడి సృష్టించిన హీరోలు, దర్శకుల గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన ఫ్యాక్షన్ సినిమాల్లో అదిరిపోయే విలనీతో అబ్బురపరిచిన నటుడు జయప్రకాష్ రెడ్డి.
మొదట్లో ఈ కథలతో వచ్చిన సినిమాల్లో హీరోలు, దర్శకులు వేరుగా కనిపించారు కానీ.. ఆ చిత్రాల్లో కామన్‌గా విలన్ పాత్ర పోషించింది జయప్రకాష్ రెడ్డే. ఫ్యాక్షనిజం కథతో తెరకెక్కి తొలిసారి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ప్రేమించుకుందాం రా’లో ఆయన విలనీ ఎంత గొప్పగా పండిందో తెలిసిందే. అదే కోవలో సమరసింహారెడ్డి, జయం మనదేరా, చెన్నకేశవరెడ్డి లాంటి సినిమాల్లో అద్భుతమైన విలనీతో అదరగొట్టేశారు.
ఐతే ఇంతగా విలనీ పండించిన ఆయన.. ఆ తర్వాత ఉన్నట్లుండి కామెడీ పాత్రల్లోకి మారారు. తాను భయపెట్టిన ఫ్యాక్షన్ పాత్రలతోనే ఆ తర్వాతి రోజుల్లో నవ్వించారు. ‘ఎవడి గోల వాడిది’లో సినిమా మొత్తం ఒక్క టవల్ కట్టుకుని పిరికి ఫ్యాక్షనిస్టుగా నవ్వులు పండించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. జయప్రకాష్ రెడ్డి చివరగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోనూ చేసింది ఫ్యాక్షనిస్టు పాత్రే. ప్రకాష్ రాజ్ తండ్రిగా హీరో ముందు ఎక్కడలేని గాంభీర్యం ప్రదర్శించి.. ఆ తర్వాత బెదిరిపోయే పాత్రలో తనదైన శైలిలో నవ్వులు పంచారాయన.
సీమ యాసను, మాండలికాల్ని జయప్రకాష్ రెడ్డిలా అంత అద్భుతంగా పలికి ప్రేక్షకులను మెప్పించిన మరో నటుడు తెలుగు తెరపై కనిపించడు. హీరోల ఫేమస్ డైలాగుల్ని వల్లె వేసిన తరహాలోనే.. జయప్రకాష్ రెడ్డి ‘సీమ’ డైలాగులు ప్రేక్షకుల నోళ్లపై ఎప్పుడూ నానుతుంటాయి. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో కేవలం తన నవ్వునే ఒక మేనరిజంగా మార్చి జయప్రకాష్ రెడ్డి నవ్వించిన తీరు అద్భుతం.
చిన్న చిన్న పాత్రలతో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. అందుకు ‘ఛత్రపతి’లో కనిపించే ఐదు నిమిషాల పాత్ర ఒక ఉదాహరణ. ఇలా చిన్న పెద్ద అని తేడా లేకుండా తాను చేసిన ప్రతి పాత్రతో మెప్పించిన నటుడు జయప్రకాష్ రెడ్డి. ఎవరైనా సినిమా వాళ్లు పోయినపుడు వాళ్లు అప్పటికి ఏ స్థితిలో ఉన్నా సరే.. ‘ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు’ అని ఒక మాట అనేస్తుంటారు. ఈ మాట నూటికి నూరు శాతం సరిపోయే వ్యక్తి జయప్రకాష్ రెడ్డి అనడంలో మరో మాట లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates