300 కోట్ల జెండాతో హనుమాన్ విజయగర్వం

విడుదలైన పాతిక రోజులకే హనుమాన్ సగర్వంగా 300 కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు పెట్టాడు. ఇవాళ టీమ్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ముందు చిన్న సినిమాగా ముద్ర వేయించుకుని, మొదటిరోజు హైదరాబాద్ లో కేవలం నాలుగు సింగల్ స్క్రీన్లు మాత్రమే దక్కించుకున్న స్టేజి నుంచి మొత్తం పండగ చిత్రాల్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దాకా ప్రయాణం చేసిన హనుమాన్ విజయాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. తేజ సజ్జ లాంటి అప్ కమింగ్ హీరోతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏకంగా బాహుబలి రికార్డులకే ఎసరు పెట్టడం కొన్నేళ్ల పాటు చెప్పుకునే చరిత్రగా మిగలనుంది.

గత కొన్నిరోజులుగా హనుమాన్ వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వారాంతాలు మళ్ళీ తన కంట్రోల్ లోకే వస్తున్నాయి. కొత్తగా రిలీజై డీసెంట్ టాక్ తెచ్చుకున్న అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు కన్న చాలా చోట్ల మొన్న ఆదివారం వసూళ్లు హనుమాన్ కే బాగుండటం గమనించాల్సిన విషయం. షేర్ రూపంలో ఇప్పటికే నూటా అరవై కోట్లకు పైగా రాబట్టి తొంబై అయిదేళ్ల టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడం మాములు మైలురాయి కాదు. ఈ వారం రవితేజ ఈగల్, యాత్ర 2, లాల్ సలామ్ లు వస్తున్న నేపథ్యంలో హనుమాన్ కౌంట్ తగ్గిపోనుంది. డైరెక్ట్ సెంటర్స్ కొనసాగబోతున్నాయి.

ఇలా నాలుగు వారాల పాటు స్టడీ రన్ దక్కించుకున్న హనుమాన్ టీమ్ ముందు నుంచి వ్యక్తం చేస్తూ వచ్చిన నమ్మకమే నిజమయ్యింది. గుంటూరు కారం లాంటి భారీ పోటీని తట్టుకుని విజేతగా నిలవడం ఎవరూ ఊహించనిది. ఇంత సాధించినా టీమ్ రిలాక్స్ అవ్వలేదు. యుఎస్ లో ప్రమోషన్లు చేయడంలో బిజీగా ఉంది. ఫైనల్ రన్ ఇంకా ఉంది కాబట్టి ఓటిటి ప్రీమియర్ సైతం మార్చికి వాయిదా వేశారనే సంగతి తెలిసిందే. కేవలం ముప్పై కోట్ల థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బి బరిలో దిగి నూటా అరవై కోట్లను దాటేయడమంటే నభూతో నభవిష్యత్ అనే మాట చిన్నదే అనిపిస్తుంది.