సామజవరగమన దారిలో ఊరిపేరు భైరవకోన

ఈగల్ కు సోలో రిలీజ్ దక్కాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 9 నుంచి 16కి షిఫ్ట్ అయిపోయిన ఊరి పేరు భైరవకోన ప్రమోషన్లు చిన్న బ్రేక్ తీసుకున్నాయి. తిరిగి ఆదివారం నుంచి మళ్ళీ స్పీడ్ పెంచబోతున్నారు. సమర్పకుడిగా ఉన్న అనిల్ సుంకర గతంలో సామజవరగమన మీద చూపించిన కాన్ఫిడెన్సే ఇప్పుడు దీనికీ చూపించబోతున్నారట. అందులో భాగంగా 14 నుంచి తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్లు వేసే ఆలోచన దాదాపు ఖరారైనట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తుది నిర్ణయం తీసుకున్నాక రెండో మూడు రోజుల్లో ప్రకటించే అవకాశమున్నట్టు తెలిసింది.

ఎలా చూసుకున్నా ఊరిపేరు భైరవకోనకు చాలా సానుకూలంశాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది మంచి టైమింగ్. సంక్రాంతి సందడి తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు పర్వాలేదనిపించుకున్నా వసూళ్ల పరంగా అద్భుతాలు చేయడం లేదు. డీసెంట్ రన్ తో ముగించేలా ఉంది. ఈగల్ కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఇబ్బంది లేదు. ఎందుకంటే థియేటర్ల ఫీడింగ్ కు ఒక్క సినిమా సరిపోదు. ఇంకో రెండు ఉన్నా ఇబ్బంది లేదు. ఎలాగూ ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1కి వాయిదా పడింది కాబట్టి ఉన్న సింగిల్ కాంపిటీషన్ కూడా తగ్గిపోయింది.

విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఊరిపేరు భైరవకోనకు ఒకపక్క సంగీతం ప్లస్ అవుతుండగా హారర్ ప్లస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో కూడిన ట్రైలర్ ఆడియన్స్ లో ఆసక్తి రేపింది. దీనికి సామజవరగమనకు రాజేష్ దండానే నిర్మాతగా వ్యవహరించడం వల్ల ప్రీమియర్ల ప్లానుకి మార్గం మరింత సుగమం అయ్యింది. కనెక్ట్ అయ్యేలా చూపించాలే కానీ ప్రేక్షకులు హారర్ జానర్ ని బాగా ఆదరిస్తారని గత ఏడాది విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2 నిరూపించాయి. వాటి కన్నా ఎక్కువ ప్రొడక్షన్ వేల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్ తో రూపొందుతున్న భైరవకోన మీద మేకర్స్ కు ఆ మాత్రం నమ్మకం ఉండటంలో ఆశ్చర్యం లేదు.