అక్కినేని నాగార్జున ఈ సంక్రాంతికి గొప్ప ఉపశమనం పొందాడు. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న ఆయనకు ‘నా సామిరంగ’ సంతృప్తినిచ్చింది. ఇది గొప్ప సినిమా ఏమీ కాదు కానీ.. సంక్రాంతి సీజన్ కలిసొచ్చి బాగానే ఆడింది. నాగ్ ఖాతాలో ఒక సక్సెస్‌ను జమ చేసింది.
ఈ ఉత్సాహంలో ఆయన వరుసగా సినిమాలు చేయబోతున్నారు. ఆల్రెడీ ధనుష్-శేఖర్ కమ్ముల కలయికలో తెరకెక్కుతున్న చిత్రంలో నాగ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అది హీరో క్యారెక్టర్‌కు దీటుగానే ఉంటుందని అంటున్నారు. మరోవైపు వచ్చే సంక్రాంతి టార్గెట్‌గా మరో రూరల్ డ్రామా చేయాలని నాగ్ చూస్తున్నాడు. అది ‘బంగార్రాజు’కు సీక్వెల్‌గా ఉండొచ్చు లేదా.. కొత్త కథతో రావచ్చు. ఆ దిశగా కసరత్తు జరుగుతోంది.
మరోవైపు నాగ్ వందో సినిమా మైలురాయి మీద ఫోకస్ పెట్టాడు. ముందు ఈ ప్రాజెక్టుకు మోహన్ రాజాను దర్శకుడిగా పరిశీలించారు. కానీ వర్కవుట్ కాలేదు. ఐతే కోలీవుడ్ నుంచే నవీన్ అనే యువ దర్శకుడు నాగ్‌ను సంప్రదించి కొంత కాలంగా చర్చలు జరుపుతున్నాడు. తమిళంలో ‘మూడర్ కూడం’ అనే సినిమాతో ఆకట్టుకున్న నవీన్.. నాగ్ కోసం ఓ భారీ కథనే రెడీ చేశాడట.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో చేసే అవకాశం ఉందట. బహు భాషల నటీనటులను ఈ సినిమా కోసం తీసుకుంటారని సమాచారం. తమిళ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకడైన సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్లో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే నాగ్ వందో సినిమాగా ఈ సినిమాను ప్రకటిచబోతున్నట్లు తెలిసింది.