నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఆల్ టైం బెస్ట్ కామెడీ మూవీస్ లో ‘ఆ ఒక్కటి అడక్కు’ది ప్రత్యేక స్థానం. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో హీరోకు, మామగా నటించిన రావుగోపాలరావుకు మధ్య జరిగే సన్నివేశాలు ఓ రేంజ్ లో పేలాయి. హాస్యభరిత చిత్రాలకు సైతం గొప్ప సంగీతం ఇవ్వగల ఇళయరాజా దీనికిచ్చిన పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ పేరుని అల్లరి నరేష్ కొత్త సినిమాకు వాడుకోబోతున్నట్టు టాక్. తండ్రి తీసిన క్లాసిక్ టైటిల్ తో కొడుకు హీరోగా నటించడం అరుదు. అందులోనూ దీనికి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది.
కాకపోతే కొన్ని వారాల క్రితం ఆ ఒక్కటి అడక్కు పేరుతోనే ఓ సినిమాను లాంచ్ చేశారు. రామ్ అంకంని దర్శకుడిగా పరిచయం చేయనున్నామని చెప్పారు. షూటింగ్ పూర్తయినట్టు పలు వార్తలొచ్చాయి. బాలీవుడ్ హాస్య నటుడు జానీ లివర్ కూతురు జామీ లివర్ దీని ద్వారా తెలుగు తెరకు తీసుకొస్తున్నారు. మరి ఇప్పుడు అల్లరోడికి ఈ టైటిల్ అంటే ఏదైనా అండర్ స్టాండింగ్ జరిగిందా లేక రెండూ ఒకటేనా అంటే కాదనే అంటున్నాయి అంతర్గత వర్గాలు. ప్రస్తుతానికి ఇంకా ప్రకటించలేదు కాబట్టి అనౌన్స్ మెంట్ వచ్చే దాకా వేచి చూడాలి. కొద్దిరోజుల్లో కన్ఫ్యూజన్ తీరిపోవచ్చు.
నా సామిరంగతో ఇంకో హిట్టు ఖాతాలో వేసుకున్న అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, నాంది లాంటి సీరియస్ సబ్జెక్టులు వర్కౌట్ కాకపోవడంతో తిరిగి ఎంటర్ టైన్మెంట్ రూటు పట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న బచ్చల మల్లి కూడా వినోదాత్మకంగానే ఉంటుందట. ఆ ఒక్కటి అడక్కు మాత్రమే కాదు అలీబాబా అరడజను దొంగలు, జంబలకిడిపంబ లాంటి వాటిని మళ్ళీ రీమేక్ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అల్లరి నరేష్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనక మాడరన్ టచ్, కొత్త ట్రీట్ మెంట్ తో ఆడియన్స్ ని అలరించే అవకాశం దక్కుతుంది.