సలార్ స్పీడుకి యానిమల్ బ్రేకులు

థియేటర్లలోనే కాదు ఈ మధ్య ఓటిటిలో వచ్చే కొత్త సినిమాల మధ్య కూడా పోటీ నెలకొంటోంది. తక్కువ గ్యాప్ లో బ్లాక్ బస్టర్స్ ని ఒకే ఓటిటిలో స్ట్రీమింగ్ చేయడం వల్ల సమస్యలొచ్చి పడుతున్నాయి . మొన్న 20 నుంచి సలార్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం గంటల వ్యవధిలో ట్రెండింగ్ లో దూసుకుపోయింది. ఇరవై ఎనిమిది రోజుల థియేట్రికల్ గ్యాప్ తో డిజిటల్ రిలీజ్ కావడంతో అభిమానులు, కామన్ ఆడియన్స్ విపరీతంగా చూడటం మొదలుపెట్టారు. సగం వారం అయ్యేలోపు టాప్ టెన్ లిస్టులో మూడు భాషల వెర్షన్లు ఉన్నాయంటేనే రీచ్ అర్థం చేసుకోవచ్చు.

కట్ చేస్తే సరిగ్గా వారం తిరిగే లోపు అదే నెట్ ఫ్లిక్స్ లో యానిమల్ వచ్చేసింది. రిలీజై సుమారు రెండు నెలలు కావస్తున్నా దీని మీద క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. అసలే సందీప్ వంగా సృష్టించిన బోల్డ్ అండ్ వయొలెంట్ కంటెంట్ యూత్ కి పిచ్చిగా నచ్చేసింది. అలాంటప్పుడు మళ్ళీ మళ్ళీ చూసే ఛాన్స్ వస్తే వదులుకుంటారా. అంతే ఎగబడి చూస్తున్నారు. దీంతో మొన్నటిదాకా సలార్ మీదున్న ప్రేక్షకుల్లో అధిక శాతం ఒక్కసారిగా యానిమల్ వైపు షిఫ్ట్ అయిపోయారు. కనీసం రెండు వారాల గ్యాప్ ఉన్నా బాగుండేదని ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడటంలో న్యాయముంది.

ఇలా చేయడం వెనుక నెట్ ఫ్లిక్స్ కి స్ట్రాటజీ ఉంది. దాని ప్రకారమే వెళ్తుంది. వచ్చే నెల గుంటూరు కారం లాంటి క్రేజీ రిలీజులున్నాయి కాబట్టి ఏ వారానికి ఆ వారం మొత్తం సంవత్సరానికి సరిపడా క్యాలెండర్ ని ముందే సిద్ధం చేసుకుంటుంది. సలార్ అయితే త్వరగా వచ్చింది కానీ యానిమల్ కి ఎనిమిది వారాల తర్వాత స్మార్ట్ స్క్రీన్ మీద మోక్షం దక్కింది. ప్రస్తుతం డిజిటల్ వరల్డ్ లో ఈ రెండు సినిమాల గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. వాటి తాలూకు ఫోటోలు, కట్ చేసిన వీడియోలు, కంటెంట్ మీద డిబేట్లు ఒకటా రెండా మూవీ లవర్స్ రచ్చ మాములుగా లేదు.