టిల్లు స్క్వేర్ జాగ్రత్త పడ్డాడు

ఇంకా దేవర వాయిదా ఉన్నది లేనిది టీమ్ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ ఇంకోవైపు ఇతర సినిమాల నిర్మాతలు అలెర్ట్ అయిపోయి దాని చుట్టుపక్కల తేదీలను లాక్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా టిల్లు స్క్వేర్ ని మార్చ్ 29 విడుదల చేయబోతున్నట్టు సితార సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఫ్యామిలీ స్టార్ డేట్ డిసైడ్ చేసుకోవడంలో తచ్చాడుతున్న అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. ఒకవేళ అది ఏప్రిల్ 5 వచ్చినా ఇబ్బంది లేదు. ఆలోగా టిల్లు స్క్వేర్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే తర్వాత పోటీవల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు.

దీని వెనుక తెలివైన వ్యూహం కనిపిస్తోంది. ముందుగా జాగ్రత్త పడి డేట్లు లాక్ చేసుకోకపోతే సమస్యలు వస్తున్నాయి. సంక్రాంతికి ఈగల్ తప్పుకోవడం వల్ల కలిగిన ఇబ్బంది ఇప్పుడు ఊరి పేరు భైరవకోన మెడకు చుట్టుకుంది. పరిష్కారం దొరక్కపోయినా ఫిలిం చాంబర్ కు ఇదంతా చికాకు తెప్పించే వ్యవహారమే. అందుకే టిల్లు స్క్వేర్ ముందే కర్చీఫ్ వేసుకోవడం ద్వారా మంచి ఎత్తుగడ వేసింది. ఈ లెక్కన దేవర ఏప్రిల్ అయిదుకు రావడం లేదనే క్లారిటీ వచ్చేసినట్టే. అఫీషియల్ గా చెప్పకపోయినా అంతర్గతంగా తెలుసుకున్న సమాచారాల మేరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.

డీజే టిల్లు బ్లాక్ బస్టర్ తర్వాత తొందపడకూడదనే ఉద్దేశంతో సిద్దు జొన్నలగడ్డ రెండేళ్లకు పైగా ఈ సీక్వెల్ కోసమే కష్టపడ్డాడు. దర్శకుడిని మార్చాల్సి వచ్చినా రాజీ పడలేదు. అనుపమ పరమేశ్వరన్ తన రెగ్యులర్ ఇమేజ్ కి భిన్నంగా కాస్త బోల్డ్ గా నటించినట్టు వస్తున్న స్టిల్స్ అంచనాలు పెంచేస్తున్నాయి. యూత్ లో టిల్లు కున్న క్రేజ్ దృష్ట్యా బిజినెస్ పరంగా భారీ ఆఫర్లు వస్తున్నాయి. మొదటి భాగంతో పోల్చుకుంటే నాలుగింతలు ఎక్కువ రేట్లు ఇవ్వడానికి బయ్యర్లు సిద్ధంగా ఉన్నట్టు టాక్. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ రామ్ కామ్ ఎంటర్ టైనర్ కు రామ్ మిర్యాల సంగీతం సమకూరుస్తున్నారు.