శ్రీలీల అంత దూరం ఆలోచిస్తుందా

మొన్నటి దాకా క్షణం తీరిక లేకుండా ఉదయం నుంచి రాత్రి దాకా షూటింగుల్లోనే ఉండాల్సి వచ్చిన శ్రీలీలకు బ్రేక్ వచ్చింది. నెలకొకటి చొప్పున అక్టోబర్ నుంచి వరసగా రిలీజులు పడటంతో ఏకధాటిగా బిజీగా ఉండిపోయింది. ఎంబిబిఎస్ పరీక్షలను సైతం వాయిదా వేసుకుంది. అయితే ట్రాక్ రికార్డ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. భగవంత్ కేసరి ఒక్కటే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ అధిక శాతం క్రెడిట్ వన్ మ్యాన్ షో చేసిన బాలయ్యకు వెళ్ళింది. శ్రీలీల హీరోయిన్ కాకపోవడం కమర్షియల్ గా మైనస్సైనా పెర్ఫార్మన్స్ పరంగా ప్లస్ అయ్యింది.

ప్రస్తుతం తన చేతిలో కొత్త కమిట్ మెంట్లు లేవు. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరిలో ముందు ఎంపికయ్యింది తనే. ఇప్పుడా ప్లేస్ లో త్రిప్తి డిమ్రి వచ్చిందనే ప్రచారం వారం రోజుల నుంచే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ ఎప్పుడు రీ స్టార్ట్ అవుతుందో దర్శకుడు హరీష్ శంకర్ కే క్లారిటీ లేదు కాబట్టి తిరిగి కాల్ షీట్లు అడిగే దాకా గ్యారెంటీ లేదు. తన మీద షూట్ చేసింది అతి కొద్ది సీన్లు కనక అవసరం ఎంతవరకు పడొచ్చనేది చెప్పలేం. ఉప్పెనతో సెన్సేషన్ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత డిజాస్టర్లతో టాలీవుడ్ కి దూరమై ఎక్కువ తమిళం మీద ఫోకస్ పెట్టింది.

శ్రీలీల కూడా ఇలాంటి డేంజర్ జోన్ లోనే ఉంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లు మాములు ఫ్లాపులు కాదు. పోటాపోటీగా ట్రోలింగ్ మెటీరియల్ గా మారిన సినిమాలు. వసూళ్ల కోణంలో గుంటూరు కారంని ఈ క్యాటగిరీలో వేయలేకపోయినా అంచనాలు అందుకోవడంలో తడబడింది. హుషారుగా డాన్సులు చేసింది కానీ శ్రీలీలకు నటన పరంగా దొరికిన స్కోప్ తక్కువ. ఇకపై కెరీర్ ప్లానింగ్ లో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవు. స్వంత డబ్బింగ్ మీద కామెంట్లు, దర్శకులు తన డాన్సుల గురించే ఎక్కువ దృష్టి పెట్టడం లాంటివి విశ్లేషించుకోవాలి. అలా చేస్తేనే తిరిగి ట్రాక్ లో పడొచ్చు.