బోయపాటి మీద స్కంద ప్రభావం లేదు

ఒక పెద్ద డిజాస్టర్ పడ్డాక ఎంతటి దర్శకుడికైనా కుదుపు తప్పదు. బోయపాటి శీనుకి ఇది బాగా అనుభవం. వినయ విధేయ రామ తర్వాత ఇంకో స్టార్ హీరో ఎవరైనా ఛాన్స్ ఇస్తారాని అనుమాన పడితే బాలకృష్ణకు అఖండ రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. స్కందతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. రామ్ ఎంత కష్టపడినా కథాకథనాల విషయంలో బోయపాటి ఓవర్ ది బోర్డు వెళ్లడంతో అందులోని కంటెంట్ ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయింది. హడావిడిగా అనుకున్న సీక్వెల్ ఆలోచనతో స్టోరీని ఖంగాళీ చేయడంతో బొమ్మ ఎవరికీ నచ్చక ఫ్లాప్ అయ్యింది.

ఇంత జరిగినా బోయపాటి మీద స్కంద ప్రభావం పడలేదు. బాలయ్య మళ్ళీ నాలుగో సారి చేతులు కలిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్క్రిప్ట్ రెడీ చేయమని జూన్ లో ముహూర్తం పెట్టుకుందామని అన్నారట. అయితే అఫీషియల్ గా ప్రకటించడం మాత్రం ఇప్పుడొద్దని చెప్పినట్టు వినికిడి. ఇంకో వైపు ఎప్పుడో గీత ఆర్ట్స్ కోసం తీసుకున్న బాలన్స్ అలాగే ఉండిపోయింది. సరైనోడు తర్వాత అల్లు అర్జున్ తో ఇంకో సినిమా తీయించాలని అల్లు అరవింద్ ఆలోచన. కానీ పుష్ప తర్వాత బన్నీ ఇమేజ్, లెక్కలు రెండూ మారిపోయాయి. కాబట్టి అంత సులభంగా ప్రాజెక్ట్ తెరకెక్కడం ఉండదు.

ఈ రెండు బోయపాటి జేబులో ఉన్నట్టే. ముందు తెరకెక్కే ఛాన్స్ బాలయ్యదే ఎక్కువగా ఉంది. ఆయనతో తప్ప మిగిలిన హీరోలను డీల్ చేయడంలో తడబాటుని బోయపాటి శీను దాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతిసారి బాలకృష్ణతో సినిమాలు చేయడం కుదరదుగా. ఒకప్పుడంటే కోడి రామకృష్ణ లాంటి వాళ్ళు ఈ ఫీట్ చేయగలిగారు కానీ ఇప్పుడలాంటి పరిస్థితులు లేవు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న బాలయ్య దీని తర్వాత రెండు మూడు సినిమాలు చర్చలో పెట్టారు కానీ ఇంకా ఫైనల్ చేయలేదు. స్వీయ దర్శకత్వ ప్లాన్ వాటిలోనే ఉంది.