చిన్నదో పెద్దదో సినిమా ఏదైనా రిలీజ్ టైంకి వాతావరణం అనుకూలంగా ఉండటం అవసరం. లేనిపోని పోటీకి వెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయో వెంకటేష్ అంత సీనియర్ హీరోకి సంక్రాంతికే అవగతమయ్యింది. అందుకే కాంపిటీషన్ పట్ల తగినంత జాగ్రత్తగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫిబ్రవరి 2 విడుదల కాబోతోంది. ఆపై వారం తప్ప అదే రోజు చెప్పుకోదగ్గ క్లాష్ ఏదీ లేకపోవడం కుర్రాడికి కలిసి వస్తోంది. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో బ్యాండ్ మేళం వాయించే క్షురకుడిగా సుహాస్ సాధారణంగా యూత్ హీరోలు ఒప్పుకోలేని పాత్రను చేశాడు.
పండగ పూర్తయిపోయినప్పటి నుంచి తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. జనవరి చివరి వారంలో కెప్టెన్ మిల్లర్, అయలన్ లు వస్తున్నాయి. తమిళంలోనే గొప్పగా ఆడని వీటికి తెలుగులో బ్రహ్మరథం పడతారని అనుకోలేం. హృతిక్ రోషన్ ఫైటర్ కేవలం హిందీ వెర్షన్ మాత్రమే తీసుకొస్తున్నారు. సో రీచ్ పరిమితంగానే ఉంటుంది. ముందు ప్రకటించిన వ్యూహం, ప్రతినిధి 2 లాంటివి వాయిదా పడటంతో రెగ్యులర్ మూవీ లవర్స్ కి ఎగ్జైట్ మెంట్ అనిపించే స్ట్రెయిట్ మూవీస్ వచ్చే శుక్రవారం రావడం లేదు. సో నా సామిరంగ తర్వాత 17 రోజుల సుదీర్ఘమైన గ్యాప్ వచ్చేసింది.
దీన్ని సరిగ్గా క్యాష్ చేసుకునేలా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే దానికైన బడ్జెట్, బిజినెస్ కి ఈజీగా వారం పది రోజుల్లోనే రికవర్ అయిపోవచ్చు. రైటర్ పద్మభూషణ్ గత ఏడాది సరిగ్గా ఫిబ్రవరిలోనే వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఫిబ్రవరి 8న యాత్ర 2, ఒక రోజు గ్యాప్ లో ఈగల్, ఊరి పేరు భైరవకోన, లాల్ సలామ్ వస్తున్నాయి కాబట్టి అంబాజీపేటకి ఫస్ట్ వీక్ చాలా కీలకం కానుంది. బ్లాక్ బస్టరైతే తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా నిలబడిపోతుంది. దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహించిన ఈ విలేజ్ డ్రామా కోసం సుహాస్ తన జుత్తు మొత్తం తీయించడం సంచలనం రేపింది.