దసరా కోసం గేమ్ ఛేంజర్ పరుగులు

రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తరచు బ్రేక్స్ ఇస్తున్నప్పటికీ ఒకవైపు ఇండియన్ 2 పనులు చూసుకుంటూనే ఇంకోపక్క శంకర్ దీన్ని బాలన్స్ చేసే పనిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు పట్టుదలగా ఉండగా అసలు ఫస్ట్ కాపీ ఎప్పుడు సిద్ధమవుతుందో తెలియని పరిస్థితిలో ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. ముందు వినాయక చవితి అనుకున్నారు కానీ ఇప్పుడు దాన్ని దసరాకు మార్చే దిశగా ప్లానింగ్ జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. అదెలాగో చూద్దాం.

అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఆ మరుసటి రోజు తెలంగాణలో బ్రతుకమ్మ పండగ. సెలవు దినం. ఆపై 4, 5, 6 తేదీలలో లాంగ్ వీకెండ్ వస్తుంది. తిరిగి 11 దుర్గాష్టమి, 12 విజయదశమి, 13 ఆదివారం కలుపుకుని నాన్ స్టాప్ హాలీడేస్ వస్తాయి. ఒకవేళ సినిమా కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే వసూళ్ల ప్రభంజనం మాములుగా ఉండదు. ఏకంగా పది రోజులకు పైగా బాక్సాఫీస్ మీద పట్టు సాధించే అవకాశం దక్కుతుంది. ఇప్పటిదాకా ఆ డేట్ కి ఇతర ప్యాన్ ఇండియా సినిమాలేవీ కర్చీఫ్ వేయలేదు. సో ఈ ఛాన్స్ ఎలాగైనా వదలకూడదని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

భారతీయుడు 2ని ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని శంకర్ ప్లాన్. అయితే పుష్ప 2 ఉండటంతో నిర్ధారణకు రాలేకపోతున్నారు. బన్నీ సినిమా వాయిదా పడొచ్చనే ప్రచారం నేపథ్యంలో అదెంత వరకు నిజమవుతుందో తెలియదు కాబట్టి కేవలం ఆ వార్తను నమ్ముకుని డేట్ డిసైడ్ చేస్తే రిస్క్ అవుతుంది. ఇది వచ్చాకే గేమ్ ఛేంజర్ రిలీజ్ ఉండాలనేది శంకర్ సంకల్పం. దిల్ రాజు మాత్రం తనను కలిసిన అభిమానులను నేను సిద్ధంగానే ఉన్నారు, కాపీ ఎప్పుడు ఇస్తారో మూకుమ్మడిగా శంకర్ ని అడగమని చెబుతున్నారట. భేతాళుడు విక్రమార్కుడిని అడిగినట్టు ఇది ఎప్పటికి వీడుతుందో.