అంతుచిక్కని రహస్యాల ఊరు ‘భైరవకోన’

హీరోగా చెప్పుకోదగ్గ కథలు, పాత్రలే ఎంచుకుంటున్నా విజయం దోబూచులాడుతున్న సందీప్ కిషన్ కొత్త సినిమా ఊరి పేరు భైరవకోన విడుదలకు రెడీ అవుతోంది. ఫిబ్రవరి 9 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, టైగర్, ఒక్క క్షణం లాంటి విలక్షణ చిత్రాలతో పేరు తెచ్చుకున్న విఐ ఆనంద్ రవితేజతో డిస్కో రాజా తర్వాత కొంత బ్రేక్ తీసుకుని చేసిన మూవీ ఇది. థ్రిల్లర్స్ కి మంచి ఆదరణ దక్కుతున్న ట్రెండ్ లో ఊరి పేరు భైరవకోన రావడం అంచనాలు రేపుతోంది. ఇంతకీ వీడియోలో ఏం చెప్పారు.

ప్రేమే లోకంగా బ్రతికే ఒక యువకుడు(సందీప్ కిషన్) ప్రాణం కన్నా ఎక్కువగా భూమి(వర్ష బొల్లమ)ని ఇష్టపడతాడు. భావుకత ప్రపంచంలో తేలిపోతున్న సమయంలో ఆమె ఊరు భైరవకోన గురించి అతనికి తెలుస్తుంది. గరుడ పురాణంలో మాయమైన నాలుగు పేజీలే అక్కడి చరిత్రని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. మానవాతీత శక్తులు, దెయ్యాలు, క్షుద్ర పూజలు,కుట్రలు, కుతంత్రాలు ఇలా ఎన్నో ప్రమాదాల మధ్య నలిగిపోతున్న ఆ అడవి గ్రామంలో అడుగుపెట్టి అసలు రహస్యాన్ని ఛేదించేందుకు పూనుకుంటాడు. అసలు అక్కడేం జరుగుతోంది, భైరవకోన వెనుక ఉన్న రహస్యమేంటో అదే అసలు స్టోరీ.

విఐ ఆనంద్ విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కథ పూర్తిగా గుట్టు విప్పకపోయినా సస్పెన్స్, హారర్ రెండు మిక్స్ చేసి ఏదో వైవిధ్యమైన ప్రయత్నం చేసిన భావన కలుగుతోంది. సందీప్ కిషన్, వర్షలతో పాటు ఒకరిద్దరు ఆర్టిస్టులను తప్ప ఎక్కువ రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రాజ్ తోట ఛాయాగ్రహణం సన్నివేశాల్లో ఇంటెన్సిటీని పెంచేలా ఉంది. సామజవరగమన బృందం ఈసారి పెద్ద బడ్జెట్ తో వైవిధ్యమైన జానర్ ని ఎంచుకుంది. విరూపాక్ష తరహాలో ప్రేక్షకులను కట్టిపడేసే కంటెంట్ కనక ట్రైలర్ స్థాయిలో ఉంటే సందీప్ కిషన్ ఖాతాలో పెద్ద హిట్టు పడ్డట్టే.