మూడో బంగార్రాజుకి దారి దొరికింది  

అక్కినేని అభిమానులను ఆనందంలో ముంచెత్తుతూ నా సామిరంగ విజయం సాధించడం చూసి నాగార్జున ఎంత సంతోషంలో ఉన్నారో చెప్పడం కష్టం. పండగ బరిలో లేట్ గా వచ్చినా వసూళ్లు గట్టిగా ఉండటం బయ్యర్లకు లాభాలు తేవడం ఖాయం చేసింది. సరైన మాస్ అవతారంలో చూపిస్తే జనం ఆదరిస్తారని అర్థమైపోవడంతో ఇకపై ఘోస్ట్, వైల్డ్ డాగ్ లాంటి యాక్షన్ ప్రయోగాలకు స్వస్తి చెప్పాలని నాగ్ నిర్ణయించుకున్నాడు. అభిమానులు, సామాన్య ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో వాటిని ఇవ్వాలి తప్పించి ఓటిటి ట్రెండ్ లో ఎక్కువగా ఊహించుకోకూడదని క్లారిటీ వచ్చేసింది.

ఈ సందర్భంగా బంగార్రాజు 3ని సిద్ధం చేయించే పనిలో ఉన్నారట. సోగ్గాడే చిన్ని నాయన బ్లాక్ బస్టర్ తర్వాత బంగార్రాజు హిట్టే కానీ మరీ మొదటి భాగమంత స్థాయిలో రికార్డులు కొల్లగొట్టలేదు. నాగ్, నాగచైతన్యల కాంబినేషన్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా బంగార్రాజు 3ని తీయాలని నిర్ణయం తీసుకున్నట్టు వినికిడి. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. సుస్మిత నిర్మాతగా చిరంజీవితో చేయాల్సిన సినిమా కాస్తా భోళా శంకర్ డిజాస్టర్ వల్ల పక్కకెళ్లిపోయింది. తిరిగి పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు.

సో ఒకవేళ బంగార్రాజు ఆఫర్ కనక అతనికే ఇస్తే హ్యాట్రిక్ కోసం కష్టపడతాడు. నాగార్జున తన విషయంలో ముందు నుంచి చాలా సానుకూలంగా ఉన్నారు. సో సీక్వెల్ బాధ్యతలు అప్పజెప్పడంలో పెద్దగా ఆలోచన చేయననక్కర్లేదు. నా సామిరంగ విజయం సాధించినా కొన్ని అంశాలు దర్శకుడు విజయ్ బిన్నీ సరిగా హ్యాండిల్ చేయలేదనే కామెంట్ బయట ఉంది. అవి బ్యాలన్స్ అయ్యుంటే ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్ళేదన్న అభిప్రాయంలో తప్పు లేదు. ఇవన్నీ బంగార్రాజులో రిపీట్ కాకుండా సరిచేసుకోవచ్చు. అన్నట్టు మూడో భాగంలో అఖిల్ ని కూడా సెట్ చేయాలనే ఆలోచనలో నాగ్ ఉన్నారట.