నాగార్జున ఫ్యాన్స్ కోరుకున్నదే జరిగింది

సంక్రాంతి పండగను ఎట్టి పరిస్థితుల్లో వదులుకూడదన్న ఉద్దేశంతో నా సామిరంగను ఆఘమేఘాల మీద పూర్తి చేయించి స్వంత రిస్క్ మీద రిలీజ్ చేయించిన నాగార్జున దానికి తగ్గట్టే భారీ ఓపెనింగ్ అందుకోవడం ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తుతోంది. ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే నాలుగున్నర కోట్ల దాకా షేర్ రావడం చిన్న విషయం కాదు. గ్రాస్ పదకొండు కోట్లకు పైగానే ఉంది. ఇంత కాంపిటీషన్, ఓ మూడు వందల థియేటర్లు దొరకడమే కష్టమైన టైంలో ఇలాంటి వసూళ్లు చూస్తే అభిమానులు ఆనందపడేందుకు ఇంతకన్నా కారణం కావాలా.

కిష్టయ్యగా నాగ్ ఊర మాస్ బిసి సెంటర్లలో బాగా ఎక్కేస్తోంది. భీభత్సం చేస్తున్న హనుమాన్ తర్వాత ఇదే బెస్ట్ ఆప్షన్ గా ఫీలవుతున్నారు. గుంటూరు కారం టాక్ దాని కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తున్నా మెల్లగా నా సామిరంగ గురించి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఒక వర్గం ప్రేక్షకులను ఇటువైపు తిప్పేస్తోంది. వైల్డ్ డాగ్, ఘోష్ట్ అంటూ సామాన్య జనాలకు అర్థం కాని ఎక్కని జానర్లు ఎంచుకుని పొరపాట్లు చేసిన నాగార్జున కీరవాణి చెప్పినట్టు తిరిగి ప్రెసిడెంట్ గారి పెళ్ళాం టైపు విలేజ్ మాస్ కు వెళ్లిపోవడం వర్కౌట్ అవుతోంది. సోగ్గాడే చిన్ని నాయనా రేంజ్ కు చేరుకునేది లేనిది వేచి చూడాలి

నిన్న సాయంత్రం జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో నాగ్ మొహంలో సంతోషం స్పష్టంగా కనిపించింది. ఫ్యాన్స్ ఇంటి దగ్గరికి వచ్చి ఇలాంటివి చేయమని లెటర్లు విసిరారని చెప్పడం బట్టే అసలు పల్స్ ఏంటో ఇప్పటికి అర్థం చేసుకున్నట్టు అయ్యింది. నిన్న చాలా ప్రాంతాల్లో బెనిఫిట్ షోలకు సెలబ్రేషన్స్ చేశారు. కింగ్ గత రెండు సినిమాలు తెల్లవారుఝాము షోలు వేసుకోలేదు. కానీ నా సామిరంగకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. వెంకటేష్ కంటెంట్ పరంగా అన్ని వర్గాలను ఆకట్టుకోలేకపోవడం సామిరంగకు కలిసి వస్తోంది. సోమవారం, మంగళవారం సాలిడ్ ఫిగర్స్ నమోదు కావడం ఖాయమే.