హనుమా…..పండక్కు టికెట్లు లేవు

విడుదలకు ముందు అన్నింటికంటే చిన్న సినిమాగా కొందరు అభివర్ణించిన హనుమాన్ ఏకంగా సంక్రాంతి విజేతగా నిలిచే దిశగా అడుగులు వేస్తోంది. ఇంకా నా సామిరంగ రిలీజ్ కాలేదు కానీ ఒకవేళ అది హిట్ అయినా సరే ఇప్పటికిప్పుడు రేంజ్ లో పెద్ద మార్పులేం ఉండవు. గుంటూరు కారం టాక్ చూస్తున్నాం. సైంధవ్ సైతం మిక్స్డ్ టాక్ తోనే మొదలైంది. దీంతో హనుమాన్ టికెట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ లో రెండు మూడు టికెట్లు ఒకే థియేటర్లో కావాలంటే దొరికే పరిస్థితి ఎంత మాత్రం లేదు. సదరు మేనేజర్లు, ఓనర్లకు ఫోన్లు చేసినా లాభం ఉండటం లేదు.

బుక్ మై షో లో సగటు గంటకు 25 వేల హనుమాన్ టికెట్లు అమ్ముడుపోతుండగా గుంటూరు కారం 10 వేల లోపే పరిమితం కావడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఇదేదో డిస్ట్రిబ్యూటర్లు చెప్పే సమాచారం కాదు. యాప్ ఎవరు ఓపెన్ చేసి చూసినా ఫిగర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటుఇటుగా జనవరి 16 దాకా ఏ మెయిన్ సెంటర్లో అంత సులభంగా టికెట్లు దొరికే సీన్ కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో స్క్రీన్లు పెంచినా దానికి అనుగుణంగా అంతకంటే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. జనాలు ఇష్టపడని కొన్ని డబ్బా థియేటర్లు సైతం హనుమాన్ పుణ్యమాని కళకళలాడుతున్నాయి.

హనుమాన్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 22 కోట్ల దాకా వచ్చినట్టు సమాచారం. ఇందులో ప్రీమియర్ షోల కౌంట్ కూడా ఉంది. ఒకవేళ ఇంత కాంపిటీషన్ లేకుండా సోలోగా వచ్చి ఉంటే ఈ లెక్క ఇంకెంత పెద్దగా ఉండేదో ఊహించుకోవడం కష్టమే. టీమ్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది. మొదటి వారం థియేటర్ల పరంగా ఇబ్బందులు కొనసాగుతున్నా సరే సెకండ్ వీక్ నుంచి తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటు నార్త్ లోనూ హిందీ వెర్షన్ 2 కోట్లకు పైగా రాబట్టగా వారాంతం నుంచి అనూహ్యమైన పికప్ ఉంటుందని బాలీవుడ్ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.