సీనియర్ హీరోలు సౌండ్ పెంచాలి

సంక్రాంతి సినిమాల హడావిడి వాడివేడిగా జరుగుతోంది. ఒకపక్క హనుమాన్ బుకింగ్స్ ఆశ్చర్యం కలిగిస్తుండగా ఇంకోవైపు గుంటూరు కారం థియేటర్లను షోలు పడక ముందే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది, ఈ నేపథ్యంలో సైంధవ్, నా సామిరంగ సౌండ్ తక్కువగా వినిపించడం చూసి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. నిజానికి ఇద్దరూ తమ శాయశక్తులా ప్రమోషన్లు చాలా యాక్టివ్ గా చేస్తున్నారు. రెండింటికి ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగాయి. కానీ ఎందుకనో ఆశించిన స్థాయిలో సోషల్ మీడియాలో హైలైట్ కాలేదు. ఇంటర్వ్యూలు గట్రా గట్టిగానే ఇచ్చారు. రీచ్ మాత్రం ఇంకా ఊపందుకోవాల్సి ఉంది.

దీనికి కారణాలు లేకపోలేదు. గుంటూరు కారం జపంలో ఆడియన్స్ మునిగి తేలుతున్నారు. టికెట్ల గురించిన చర్చలతోనే ట్విట్టర్ హోరెత్తిపోతోంది. అటుపక్క హనుమాన్ షోల తాలూకు అప్డేట్స్ ని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు క్రమం తప్పకుండ అప్డేట్ చేస్తూ హైప్ ని పెంచుకుంటూ పోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ కి షో వేసి శభాష్ అనిపించుకున్నారు. ఇతర నార్త్ జర్నలిస్టులకి మధ్యాహ్నం షో రన్ అవుతోంది. తెలుగు మీడియాకి ఇవాళ సాయంత్రం ప్రీమియర్ జరుగుతుంది. ఈ పరిణామాలు గుంటూరు కారం, హనుమాన్ లకు సానుకూలంగా పనిచేస్తున్నాయి.

సైంధవ్, నా సామిరంగలు ఎదురు చూస్తోంది ఒకటే. తమ పోటీ సినిమాలకు ఇంకొద్ది గంటల్లో రాబోయే టాక్ ఎలా ఉంటుందనే. దాన్ని బట్టి స్పీడ్ ఎంత పెంచాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. స్వంత డిస్ట్రిబ్యూషన్ ఎంత బలంగా ఉన్నా వెంకటేష్ కు తగినన్ని స్క్రీన్లు రాలేదని ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. నా సామిరంగ ఆదివారం రిలీజ్ ని ఎంచుకోవడంతో హిట్ టాక్ వచ్చినా చేతిలో ఉన్న థియేటర్లు సరిపోవనే టెన్షన్ లో అక్కినేని అభిమానులున్నారు. ఇదంతా తీరాలంటే రేపు మధ్యాన్నం దాకా ఆగాలి. మహేష్ బాబు, తేజలు కూల్ అయ్యాక అప్పుడు వెంకీ, నాగ్ సౌండ్ గట్టిగా వినొచ్చు.