రెండేళ్ల క్రితం 2022లో మహేష్ బాబు కుటుంబానికి చెందిన కుర్రాడిగా జనం దృష్టిలో పడ్డ అశోక్ గల్లా హీరోతో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఆశించిన ఫలితం దక్కకపోయినా కుర్రాడిలో స్పార్క్ ఉన్న విషయం అర్థమైపోయింది. అయితే నటన పరంగా ఇంకా మెరుగు పడాలనే ఉద్దేశంతో కొంత బ్రేక్ తీసుకున్న అశోక్ ఇప్పుడు దేవకి నందన వాసుదేవగా రాబోతున్నాడు. గుణ 369తో డైరెక్షన్ డెబ్యూ చేసిన బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల రెండో సినిమా ఇది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించగా సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చారు. ఇవాళ టీజర్ వచ్చింది.
ఊళ్ళో సరదాగా తిరుగుతూ, కృష్ణుడిని ఆరాధిస్తూ, జీవితాన్ని గడిపేస్తున్న కుర్రాడు(అశోక్ గల్లా). చూడగానే ఓ అమ్మాయి(మానస వారణాసి)ని ప్రేమిస్తాడు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో గుడికి సంబంధించిన రహస్యమేదో అతన్ని ప్రమాదంలో నెడుతుంది. మనుషులను మంచినీళ్లు తాగినంత సులభంగా చంపేసే ఓ దుర్మార్గుడు(దేవదత్త నాగే)తో ఈ అబ్బాయి తలపడాల్సి వస్తుంది. దీని వెనుక అమ్మ(దేవయాని)కిచ్చిన మాట కూడా ఉంటుంది. అసలు వాసుదేవ వెనుక ఉన్న నేపథ్యం ఏంటి, ఎందుకు రాక్షసుడు లాంటి వ్యక్తితో తలపడ్డాడు అనేదే స్టోరీ.
కథని తాలూకు గుట్టుని విప్పకపోయిన మెయిన్ పాయింట్ చూచాయగా చెప్పారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, ప్రసాద్ మూరెళ్ళ – రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం లాంటి క్వాలిటీ సాంకేతిక వర్గం అండగా నిలిచింది. ప్రొడక్షన్ వేల్యూస్ ఘనంగా కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా గల్లా అశోక్ మేకోవర్ ఆశ్చర్యపరుస్తుంది. హీరోలో ఆకతాయిగా కనిపించిన దానికి ఇప్పటి మాస్ విలేజ్ లుక్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఎక్కువ ఆర్టిస్టులను రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. క్లాసుని టార్గెట్ చేసేలా టైటిల్, మాస్ ని లక్ష్యంగా పెట్టుకుని కంటెంట్ మొత్తానికి దేవకి నందన వాసుదేవ ఆసక్తి రేపడంలో సక్సెసయ్యాడు.