వాయిదాలు, అనుమతులు, టెన్షన్ల మధ్య హైదరాబాద్ నుంచి గుంటూరుకు వేదిక మార్చుకున్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఆఘమేఘాల మీద ఏర్పాట్లు చేసి ఫ్యాన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న వైనం పెద్ద రిలీఫ్. మాములుగా ఇంత పెద్ద ఫంక్షన్ కు కనీసం మూడు రోజులు సమయం ఉంటే తప్ప ఖచ్చితమైన ఫలితాన్ని ఆశించలేం. కానీ ఆర్గనైజ్ చేసిన తీరు విమర్శలకు తావివ్వలేదు. ఈ సందర్భంగా ప్రసంగించిన హీరో మహేష్ బాబు బాగా ఎమోషనల్ అయిపోయి అభిమానుల కంటిని తడి చేశాడు.
స్పీచ్ కన్నా ముందు మహేష్ 25 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని ఏవి రూపంలో చూపించారు. నిజానికి తనకా సంగతి గుర్తులేదట. రాజకుమారుడుకి ఇది సిల్వర్ జూబిలీ ఇయర్. ఆ విషయాన్ని ఆడియోలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఏడాది తన మీద మీ ప్రేమ పెరుగుతోంది కానీ తగ్గడం లేదని, మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంకేమి చేయలేనని వెంటనే రెండు చేతులు పైకెత్తి అభివాదం చేయడంతో గ్రౌండ్ ఒక్కసారిగా హర్షధ్వానాలతో హోరెత్తింది. ఇక ఎప్పటికీ అమ్మా నాన్నా అన్నీ మీరేనని చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందంతో పరశించిపోయారు.
అతి తక్కువ వ్యవధిలో అన్నయ్య రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ గార్లను పోగొట్టుకున్న మహేష్ ఆ సమయంలో చాలా లోటుని అనుభవించాడు. అయినా సరే త్వరగా కోలుకుని తిరిగి సినిమా ప్రపంచంలోకి వచ్చాడు. నాన్న ఇచ్చిన వారసత్వాన్ని నిలబెట్టడమే కానీ అంతకు మించి అనే స్థాయిలో ఎదుగుతున్న మహేష్ వెనుక బలంగా నిలబడింది ఫ్యాన్సే. అందుకే టీజర్ రిలీజ్ కే నిన్న హైదరాబాద్ లో ఏదో ప్రీమియర్ అన్నంత హంగామా చేశారు. జనవరి 12 విడుదల కాబోతున్న గుంటూరు కారంకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే షోలు మొదలవుతున్నాయి.