స్టార్ హీరోలకు కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులతో తెరమీద విడదీయలేని అనుబంధం ఏర్పడుతుంది. అది ఏళ్ళ తరబడి ఉండటంలో ఆశ్చర్యం లేదు కానీ దశాబ్దాల తరబడి కొనసాగించడం మాత్రం విశేషమే. ఆ కోవలో ముందు చెప్పుకోవాల్సిన జంట మహేష్ బాబు – ప్రకాష్ రాజ్. 1999 ‘రాజకుమారుడు’తో సూపర్ స్టార్ డెబ్యూ చేసినప్పుడు అందులో మామా అల్లుళ్ళుగా ఈ బాండింగ్ మొదలయ్యింది. ‘మురారి’లో కేవలం ఒక్క సీన్ కే పరిమితమైనా కేవలం మహేష్-కృష్ణవంశీ కాంబో అనే కారణంతో ప్రకాష్ రాజ్ ఒప్పుకున్నాడు. ‘బాబీ’లో విలనిజం వర్కౌట్ కాకపోయినా ‘ఒక్కడు’ మేలిమలుపుగా నిలిచింది.
భూమికను కాపాడే మహేష్ బాబుని నీడలా వెంటాడే ఓబుల్ రెడ్డిగా ఇద్దరి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఓ రేంజ్ లో పేలింది. ‘నిజం’లో మురళీమోహన్ బదులు వేరొక ఆప్షన్ చూస్తున్నప్పుడు దర్శకుడు తేజకు ప్రకాష్ రాజ్ తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు. ‘అర్జున్’లో సరిత భర్త కం మహేష్ మావయ్య, ‘అతడు’లో పార్ధు – సిబిఐ ఆఫీసర్, ‘పోకిరి’లో పండు-అలీ భాయ్, ‘సైనికుడు’లో కాంబో,’ ఖలేజా’లో మెయిన్ విలన్ ఇలా కొనసాగుతూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు వగైరాలతో నాన్ స్టాప్ గా జరుగుతూనే వచ్చింది. వీటిలో హిట్లు ఫ్లాపులు రెండూ ఉన్నాయి.
ఇప్పుడు గుంటూరు కారంలో తాతయ్య మనవడుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ అంటే అస్సలు గిట్టని రమణ పాత్రలో మహేష్ కొత్తగా కనిపించబోతున్నాడు. పాతిక సంవత్సరాలకు పైగా ఈ ఇద్దరు కలిసి నటిస్తూనే ఉండటం విశేషం. దర్శకులు అలా సెట్ చేస్తున్నారో లేక మహేష్ తన సినిమాలో ప్రకాష్ రాజ్ ఉండాలని బలంగా కోరుకుంటున్నారో తెలియదు కానీ అభిమానులకు ఇది కూడా ఒకరకంగా సెంటిమెంట్ గానే కనిపిస్తోంది. మరి రాజమౌళితో చేయబోయే మహేష్ 29లో ప్రకాష్ రాజ్ ఉంటారో లేదో చూడాలి. ఎందుకంటే జక్కన్న విక్రమార్కుడులో చిన్న పాత్ర తప్ప మళ్ళీ ఈ కాంబో రాలేదు.