ఏజెంట్ మళ్ళీ చర్చల్లోకి వచ్చాడు

ఏదైనా సినిమా హిట్టు ఫ్లాపు సంగతి పక్కనపెడితే దాన్ని ఓటిటిలో చూడాలనుకునే ఆడియన్స్ భారీ సంఖ్యలో ఉంటారు. అందులోనూ స్టార్ హీరో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఏజెంట్ విషయంలో మాత్రం ఈ ఎదురు చూపులు తీరడం లేదు. అక్కినేని ఫ్యాన్స్ మర్చిపోలేని డిజాస్టర్ గా మిగిలిపోయిన ఈ స్పై డ్రామా కోర్టు వివాదాల వల్ల స్ట్రీమింగ్ కి నోచుకోక నెలల తరబడి వెయిటింగ్ లో ఉండిపోయింది. ఆ మధ్య సెప్టెంబర్ లో డేట్ తో సహా ప్రకటించారు కానీ చివరి నిమిషంలో పోస్ట్ పోన్ పడింది. థియేట్రికల్ రిలీజ్ రేంజ్ లో వాయిదాలు పడటం ఏజెంట్ కే జరిగింది.

తాజా అప్ డేట్ ప్రకారం జనవరి 26న ఏజెంట్ ని సోనీ లివ్ విడుదల చేసే ప్లాన్ లో ఉందట. మరి వివాదం తీరిపోయిందో లేదో ఇంకా తెలియదు. నిర్మాత అనిల్ సుంకర నుంచి దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. కానీ ఏజెంట్ తర్వాత సామజవరగమన, హిడింబలు విడుదల చేసి నెక్స్ట్ ఊరి పేరు భైరవకోనని రెడీగా ఉంచారు. కానీ ఎక్కడ అఖిల్ మూవీ ఓటిటి గురించి హింట్ ఇవ్వడం లేదు. బాక్సాఫీస్ దగ్గర దెబ్బ తిన్న సంగతి నిజమే కానీ మరీ ఒక్కసారి కూడా చూడలేమన్నంత దారుణమైతే కాదు. కాకపోతే అంచనాలలో కనీసం సగం అందుకోవడంలో ఫెయిలయ్యింది.

ఇక అఖిల్ నెక్స్ట్ సినిమా సంగతికొస్తే యువి నిర్మాణంలో కొత్త దర్శకుడు అనిల్ తో ప్లాన్ చేసిన ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొన్నామధ్య దీనికి సంబంధించి అనౌన్స్ మెంట్ ఉంటుందని ఒక ట్వీట్ వేశారు కానీ తర్వాత గప్ చుప్ అయిపోయారు. ధీర టైటిల్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో ఉంటుందనే లీక్ గతంలోనే వచ్చింది. ఈలోగా చిరంజీవి విశ్వంభరని మొదలుపెట్టిన యువి ఎందుకనో అఖిల్ ప్రాజెక్టు గురించి సౌండ్ చేయడం లేదు. సంక్రాంతికి ఏమైనా వార్త వస్తుందేమో అనుకుంటే ఆ సూచనలు పెద్దగా కనిపించడం లేదు.