ఈ సంక్రాంతికి తెలుగులో పెద్ద సినిమాల మధ్య ధైర్యంగా పోటీలో నిలిచింది హనుమాన్ అనే చిన్న సినిమా. అయితే కాస్టింగ్, బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమానే కానీ.. అవుట్ ఫుట్ విషయంలో.. బిజినెస్ పరంగా.. ముఖ్యంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో ఇది పెద్ద సినిమాలకు దీటుగా నిలిచేదే.
కాకపోతే ఈ సినిమాకు.. సంక్రాంతి పోటీ వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలినన్ని స్క్రీన్లు దక్కకపోవడం సమస్యగా మారింది. దీనివల్ల ఓపెనింగ్స్ మీద గట్టిగానే ప్రభావం పడనుంది. వేరే సినిమాలకు టాక్ తేడా కొట్టి ఈ సినిమాకు టాక్ బాగుంటే పరిస్థితి మారొచ్చు. లేదంటే మాత్రం ఇబ్బంది తప్పదు.
అయితే హనుమాన్ కు తెలుగు రాష్ట్రాల అవతల మాత్రం మంచి స్కోప్ ఉంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో కేజీఎఫ్, పుష్ప, కార్తికేయ 2 తరహాలో ఈ సినిమా సంచలనం సృష్టించే అవకాశాలు లేకపోలేదు. పైన చెప్పుకున్న చిత్రాలన్నీ కూడా పెద్దగా అంచనాలు లేకుండా ఉత్తరాదిన రిలీజ్ అయినవి. కానీ ఉత్తరాది ప్రేక్షకులకు ఆ సినిమాలు తెగ నచ్చేశాయి.
వాటికి అన్నీ కలిసి వచ్చి ఊహించని విజయాన్ని అందుకున్నాయి. హనుమాన్ హనుమంతుడి చుట్టూ తిరిగే కథ కావడం.. ఇందులోని సూపర్ నేచురల్ అంశాలు యూనివర్సల్ కావడం పెద్ద ప్లస్. ముఖ్యంగా ఉత్తరాదిన రామ మందిరం తాలూకు హడావిడి నడుస్తున్న నేపథ్యంలో సినిమా బాగుంటే దీనికి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉన్నాయి.
నార్త్ ఇండియాలో దీనికి పెద్దగా పోటీ కూడా లేదు. ప్రేక్షకులు దీని వైపు చూస్తే బోలెడన్ని స్క్రీన్లు లభిస్తాయి. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో స్క్రీన్లు, షోలు తగ్గాయి అని బాధపడాల్సిన పని కూడా ఉండదు. చిత్ర బృందం ఊహించని స్థాయిలో రెవెన్యూ రావచ్చు.