3D వద్దనుకోవడం తెలివైన నిర్ణయం

సంక్రాంతి రేసులో మంచి అంచనాలు మోస్తున్న హనుమాన్ కి థియేటర్ల సమస్య ఉన్నప్పటికీ కంటెంట్ తో పాటు అంజనీ పుత్రుడి దీవెనలే తమను నడిపిస్తుందని టీమ్ ధైర్యంగా పోటీలో అడుగు పెడుతోంది. ఆ నమ్మకంతోనే ప్రధాన కేంద్రాల్లో ముందు రోజు రాత్రి ప్రీమియర్లకు రెడీ అవుతోంది. మొదటి షో అనౌన్స్ మెంట్ అమలాపురం నుంచి వచ్చేసింది. మెల్లగా సెంటర్ల వారిగా వివరాలు ప్రకటించబోతున్నారు. నిజానికి ఈ సినిమా ఫిక్స్ చేసినప్పుడు పది భాషల్లో విడుదల కాబట్టి 3డి వెర్షన్ లో చేయాలని అనుకున్నారు. కానీ క్రమంగా ఆ ఆలోచన మానుకుని సాధారణంగానే తీసుకొస్తున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే 3డి వద్దనుకోవడం తెలివైన నిర్ణయం. ఒకవేళ ఆ టెక్నాలజీలో సినిమా చూపించాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా ఆ సాంకేతికతను సపోర్ట్ చేసే కెమెరాలు వాడాలి. కానీ హనుమాన్ మేకర్స్ దగ్గర అంత బడ్జెట్ లేదు. అన్నేసి వందల కోట్లు ఖర్చు పెట్టిన ఆదిపురుష్ కే ఆడియన్స్ మరీ స్పెషల్ గా ఫీలవ్వలేదు. అవతార్ లాంటి హాలీవుడ్ మూవీస్ తప్ప ఇండియాలో తీసిన వాటికి ఎక్స్ ట్రాడినరీ అనే ఫీడ్ బ్యాక్ వచ్చిన త్రిడి సినిమాలు చాలా అరుదు. ఒకవేళ నార్మల్ గా తీసింది 3డిలో మార్చాలన్నా ఖర్చుతో కూడుకున్నవ్యవహారం. దాని బదులు వదిలేసుకోవడం ఉత్తమం.

ఆర్ఆర్ఆర్ సైతం త్రిడిలో వచ్చినా రెస్పాన్స్ గొప్పగా రాలేదు. హనుమాన్ లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. వాటిని మంచి క్వాలిటీ ఉన్న స్క్రీన్ లో డాల్బీ సౌండ్ తో చూస్తే చాలు కనెక్ట్ అయిపోతుంది. ఇది కాకుండా ఒకవేళ త్రిడి అయితే అదనంగా టికెట్ మీద ముప్పై రూపాయలు వసూలు చేయాలి. అన్ని థియేటర్లలో ఒకే రకమైన క్వాలిటీ స్క్రీనింగ్ లేదు. దాని వల్ల అనుభూతుల్లో వ్యత్యాసం వస్తోంది. ఇవన్నీ ఆలోచించే హనుమాన్ మేకర్స్ నార్మల్ వెర్షన్ కి కట్టుబడ్డారు. తేజ సజ్జ, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ ఫాంటసీ డ్రామాలో వరలక్ష్మి, వినయ్ వర్మ ఇతర ప్రధాన తారాగణం.