జనవరి 12 విడుదల కాబోతున్న హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి టీమ్ తో పాటు అభిమానులకు ఉత్సాహం కలిగేలా ప్రసంగించడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా హను మ్యాన్ అంటూ టైటిల్ లో మధ్యలో డాష్ మార్క్ పెట్టి ప్రత్యేకత కలగజేయడం వెనుక తానున్న కారణాన్ని వివరించారు. గతంలో ఆహా కోసం సమంతా నిర్వహించిన టాక్ షోకు వెళ్లిన చిరంజీవికి ఎదురైన ప్రశ్న స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ లలో మీకు ఎవరంటే ఇష్టమని. దానికాయన ఆశ్చర్యపోయారు.
ఎవరో ముక్కు మొహం తెలియని హాలీవుడ్ సూపర్ హీరోల గురించి చెప్పడం ఎందుకని తన ఇష్టదైవం హనుమాన్ పేరునే హను మ్యాన్ అని పలికి సమాధానం చెప్పడమే దర్శకుడు ప్రశాంత్ వర్మని ఆకట్టుకుని ఇలా టైటిల్ లాక్ చేసుకునేందుకు ప్రేరేపించిందట. ఈ రకంగా ప్రభావితం చెందటం తనకెంతో సంతోషం కలిగించిందని చెప్పారు. ఇంతే కాదు నిజ జీవితంలో ప్రత్యేకంగా గుడులకు వెళ్లకపోయినా ఏదైనా సమస్య వచ్చినప్పుడు రాత్రి పడుకునే ముందు హనుమంతుడిని తలుచుకోవడం వల్ల ఉదయం లేవగానే పరిష్కారం దొరికేదని అంత మహత్తు హనుమంతుడికి ఉందని అన్నారు.
మొత్తానికి చిరంజీవి రావడం వల్ల హనుమాన్ వేడుకకు నిండుతనం వచ్చింది. మధ్యలో గొంతు జీరపోయి ఇబ్బంది పెడుతున్నా పేరు పేరునా అందరిని ప్రస్తావించి మెచ్చుకుంటూ సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఆడతాయని, థియేటర్ల సమస్య వల్ల మొదటి రోజు లేదా ఫస్ట్ షో చూడకపోయినా తర్వాత కంటెంట్ బాగుందని తెలిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా వస్తారని ఉదాహరణ చెప్పారు. ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి పోటీ టైంలో దిల్ రాజు శతమానం భవతి విడుదల చేసి విజయం సాధించడాన్ని గుర్తు చేశారు. ఫైనల్ గా మెగా ఈవెంట్ ని విజయవంతంగా పూర్తి చేశారు.