తెలుగుకి మాత్రమే పరిమితమైన ఒక కమర్షియల్ సినిమాకి ప్యాన్ ఇండియా మూవీ రేంజ్ లో హైప్ రావాలంటే మహేష్ బాబు లాంటి అతి కొందరికే సాధ్యం. అందుకే పని ఒత్తిడి వల్ల గుంటూరు కారం నుంచి అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ రాకపోయినప్పటికీ కేవలం పోస్టర్లే అవసరమైన హైప్ ని తెచ్చి పెట్టాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడటంతో ఒక్కసారిగా అందరి కళ్ళు ట్రైలర్ మీదకు వెళ్లిపోయాయి. ఆదివారం అన్నారు కానీ టైం చెప్పకపోవడంతో సుదర్శన్ థియేటర్ తో పాటు ఆన్ లైన్ లో కోట్లాది ఫ్యాన్స్ ఎదురు చూపులు గంటల తరబడి సాగాయి. ఫైనల్ గా 9 గంటలకు ఆ లాంఛనం జరిగిపోయింది.
ఇంటికి పెద్ద వాడైనా చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చిన రమణ(మహేష్ బాబు)కి తల్లి(రమ్యకృష్ణ) తనను ఎందుకలా పంపించిందో అర్థం కాని అమాయకత్వం. అయితే పెద్దయ్యాక తన కుటుంబం చిక్కుల్లో ఉందని గుర్తించి వెనక్కు వస్తాడు. ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండే అతని వ్యక్తిత్వం తాతయ్య(ప్రకాష్ రాజ్)కు సమస్యగా మారిపోతుంది. శత్రువు(జగపతిబాబు)కి నిద్ర కరువవుతుంది. తలపడితే బాదటం తప్ప ఇంకేమి పట్టని రవణ అమ్మాయి(శ్రీలీల) ప్రేమలో పడతాడు. ఓ మరదలు(మీనాక్షి చౌదరి) కూడా ఉంటుంది. అసలు రవణ లక్ష్యం ఏంటనేది సినిమాలో చూడాలి.
మాస్ ఊహించిందే కానీ మరీ ఈ రేంజ్ లో మహేష్ వన్ మ్యాన్ షో ఉండటం స్వీట్ షాక్ లా ఉంది. సింగల్ వర్డ్ పంచులతో అదరగొట్టేశాడు. ముఖ్యంగా భాషలో యాస మాస్ కి ఓ రేంజ్ లో కిక్ ఇచ్చేలా ఉంది. త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, సంభాషణల్లో మెరుపులు అడుగడుగునా తారసపడ్డాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే ఎలివేషన్ కి ఉపయోగపడింది. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణంలో క్వాలిటీ తొణికిసలాడింది. మొత్తానికి మహేష్ నుంచి ఒక్కడు, పోకిరి రేంజ్ హీరోయిజం కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా అంచనాలు అమాంతం పెంచేశారు
Gulte Telugu Telugu Political and Movie News Updates