సంక్రాంతికి ఆల్రెడీ నాలుగైదు సినిమాలు పోటీలో ఉన్నా సరే.. అక్కినేని నాగార్జున తన కొత్త చిత్రం నా సామి రంగను సంక్రాంతి రేసులో నిలిపాడు. సంక్రాంతి పండక్కి కేవలం నాలుగు నెలల ముందు ఈ సినిమా షూటింగ్ మొదలు కావడం గమనార్హం. నాగ్ గత చిత్రాలు ఎంత పెద్ద డిజాస్టర్లు అయ్యాయో తెలిసిందే. అయినా నాగ్ ధీమాగా సంక్రాంతి పోటీకి సై అన్నాడు.
పక్కా స్క్రిప్ట్, ప్లానింగ్ తో రంగంలోకి దిగి.. అనుకున్న ప్రకారమే సినిమాను పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నాడు అక్కినేని హీరో. సోగ్గాడే చిన్నినాయన తరహాలోనే సంక్రాంతికి పండక్కి పక్కాగా సూట్ అయ్యే సినిమాగా నాగ్ భావిస్తున్నాడు. ఎంత పోటీ ఉన్నా సరే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుందని నాగ్ ధీమా. ఈ ధీమాతోనే నాగ్ నా సామిరంగ థియేట్రికల్ హక్కులను ఏక మొత్తంగా కొనేసినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీదే నా సామి రంగను డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడట నాగ్.
తనే దగ్గరుండి నా సామిరంగ నాన్ థియేట్రికల్ హక్కులను 35 కోట్లకు మాటీవీ కి అమ్మించిన నిర్మాత శ్రీనివాస చిట్టూరిని దాదాపుగా సేఫ్ జోన్లోకి తెచ్చేశాడు. థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చేదంతా లాభమే. నాన్ థియేట్రికల్ హక్కుల రేట్లు బాగా పడిపోయిన ఈ రోజుల్లో నాగ్ చేసిన సాయాన్ని గుర్తుంచుకుని మార్కెట్ రేటు కంటే కొంచెం తక్కువ మొత్తానికే థియేట్రికల్ రైట్స్ ఇచ్చేస్తున్నాడట నిర్మాత. ఆ మొత్తం 15 కోట్లని సమాచారం. సినిమా వర్కౌట్ అయితే నాకు భారీగానే లాభాలు అందుకునే అవకాశం ఉంది. ఘోస్ట్ సహా పలు డిజాస్టర్లు ఎదుర్కొన నాగ్.. నా సామి రంగతో మ్యాజిక్ చేసేలాగే ఉన్నాడు.