సామాన్యుడితో స్నేహం చేసే గ్రహాంతర ‘అయలాన్’

సంక్రాంతికి మనకే థియేటర్లు సరిపోవని కిందా మీద పడుతూ డబ్బింగ్ సినిమాలకు చోటు లేదంటే అయలాన్ మాత్రం తగ్గేదేలే అనేలా ఉంది. జనవరి 12 గుంటూరు కారం, హనుమాన్ వస్తున్న రోజే రిలీజ్ కాబోతున్న ఈ స్కై ఫై థ్రిల్లర్ హీరో శివ కార్తికేయన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందింది. ఇవాళ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేయడమే కాదు అందులో డేట్ ని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో మహేష్ బాబు, తేజ సజ్జలతో పోటీకి సై అన్నట్టే ఉంది. కాకపోతే నిజంగా వస్తుందా లేక చివరి నిమిషంలో వాయిదాని చెప్పి అనువాదాన్ని వారం లేట్ గా తీసుకొస్తారా చూడాలి. కథేంటో చెప్పేశారు.

ఎక్కడో ఒక మారుమూల చిన్న ఊరిలో సంతోషంగా గడుపుతున్న యువకుడి(శివ కార్తికేయన్) జీవితంలోకి అడుగు పెడుతుందో ఎలియన్ అలియాస్ గ్రహాంతరవాసి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకపోయినా మనిషిలా కాకుండా విచిత్ర రూపంలో తనను చూసి మొదట భయపడినా తర్వాత స్నేహం చేసుకుంటాడు. అయితే అయలాన్ వచ్చింది ప్రపంచ వినాశనానికి కంకణం కట్టుకున్న ఒక దుర్మార్గుడి (శరద్ కేల్కర్) అంతం కోసమని అర్థం చేసుకున్న హీరో ఆ బాధ్యతను తాను తీసుకుంటాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది, భూమికి స్పేస్ కి మధ్య పొత్తు ఎలా కుదిరిందనేది స్టోరీ.

అప్పుడెప్పుడో వచ్చిన హృతిక్ రోషన్ కోయి మిల్ గయా ఛాయలు ఈ ఆయలాన్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దర్శకుడు ఆర్ రవి కుమార్ యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ కూడా జోడించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్, గ్రాఫిక్స్ ఆకర్షణగా నిలుస్తున్నాయి. యోగిబాబు, భానుప్రియ, ఇషా కొప్పిక్కర్ తదితరులు ఇతర తారాగణం. అమాంతం అంచనాలు పెరిగిపోయేలా లేదు కానీ చిన్నపిల్లలను టార్గెట్ చేసుకున్న అయలాన్ నిజంగానే జనవరి 12నే వస్తుందో లేదో చూడాలి. నిర్మాతగా ఒరిజినల్ వెర్షన్ తీసిన కెజెఆర్ స్టూడియోస్ పేరే ఉంది.