సంక్రాంతి సినిమాల వ్యవహారం క్రమంగా వేడెక్కుతోంది. తాజాగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నూటా యాభై కోట్లు ఖర్చు పెడితే అది పెద్ద సినిమా ఎలా అవుతుందని, రేపు ప్రేక్షకులు ఏది బాగుందో చూసి నిర్ణయించాక దేని స్థాయి ఎంతో అర్థమవుతుందని చెప్పడం చర్చకు దారి తీస్తోంది. తమకు థియేటర్లలో అన్యాయం జరుగుతోందని, డెబ్భై ఆరు సింగల్ స్క్రీన్లలో పది పదిహేను ఇమ్మన్నా కేవలం అయిదారు మాత్రమే కేటాయించడం అధిపత్యమా లేక చులకన భావమా మీరే చెప్పాలని ప్రశ్నించడం ఆశ్చర్యపరిచింది.
పోటీలో ఉన్న వాటిని పేర్లతో ప్రస్తావించకపోయినా ఆయన అన్నది ఎవరి గురించి అందరికీ అర్థమవుతోంది. జనవరి 12నే గుంటూరు కారంతో తలపడాల్సి రావడం వల్ల హనుమాన్ కి సరిపడా థియేటర్లు దొరకడం లేదన్నది ఓపెన్ సీక్రెట్. అయితే మొదటి రెండు మూడు రోజులు ఇబ్బందిగా ఉన్నా లాంగ్ రన్ లో తమదే నిలబడుతుందన్న ధీమా ఆయన వ్యక్తం కావడం విశేషం. టీమ్ ముందు నుంచి చెబుతున్నది ఇదే. నార్త్ తో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ముందే బిజినెస్ చేశాం కాబట్టి ఇప్పుడు వెనుకడుగు వేసే పరిస్థితి లేదనే నిస్సహాయతను వ్యక్తం చేస్తూనే వచ్చారు.
ఈ రెండు మూడు రోజుల్లో జరగబోయే పరిణామాలు కీలకంగా ఉండబోతున్నాయి. ఈగల్ వాయిదా ప్రచారం ప్రపంచమంతా తిరుగుతున్నా నిర్మాతలు మాత్రం నో ఛేంజనే అంటున్నారు. ఇక నా సామిరంగ, సైంధవ్ లు ఎవరి ప్లానింగ్ లో వాళ్ళున్నారు. ఇప్పటికీ పరిశ్రమ పెద్దలు కొందరు ఈ అయిదు సినిమాల క్లాష్ ని వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారట కానీ సానుకూల సంకేతాలు మాత్రం రావడం లేదు. హనుమాన్ నిర్మాత చేసిన కామెంట్లు క్రమంగా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రశ్నలు సబబే కానీ సమాధానం దొరకడం కష్టమైన పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు.
Gulte Telugu Telugu Political and Movie News Updates