దర్శకుడి మీద కేసు పెద్ద జోక్

సౌత్ లో బాగా డిమాండ్ ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ కున్న ఫాలోయింగ్ తెలిసిందే. తాజాగా ఇతని మానసిక స్థితిని అధ్యయనం చేయాలంటూ మధురైకి చెందిన రాజు మురుగన్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేయడం సంచలనం రేపుతోంది. విపరీతమైన హింస, మతాల విశ్వాసాలను దెబ్బ తీసే విధంగా కంటెంట్, మహిళలు చిన్నపిల్లల మీద హింసను ప్రేరేపించేలా చూపిస్తున్నాడని పేర్కొంటూ పిటీషన్ వేశాడు. డ్రగ్ ట్రాఫికింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, సామజిక వ్యతిరేక పోకడలు ఇవన్నీ అతని ఆలోచనల్లో తీవ్రంగా ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంటూ ఆరోపణలు చేశాడు.

నిజానికి ఇది కేవలం సెన్సేషన్ కోసం చేయడం తప్పించి మరొకటి కాదని విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే లోకేష్ కంటే ముందు ఎందరో దర్శకులు విచ్చలవిడి వయొలెన్స్, సెక్స్, మాదకద్రవ్యాల వినియోగాన్ని తమ సినిమాల్లో చూపించారు. అక్కడి దాకా ఎందుకు ఇప్పుడొస్తున్న వెబ్ సిరీస్ ల విచ్చలవిడితనం ముందు ఏవైనా దిగదుడుపే. వాటిని తీసేవాళ్ళ మీద కేసులు వేయాలి కానీ కమర్షియల్ చిత్రాలు తీసే డైరెక్టర్ల మీద పడితే వచ్చేది ఏమీ ఉండదు. ఎందుకంటే కౌంటర్ ఇచ్చే సమయంలో లోకేష్ కనగరాజ్ ఇవన్నీ ప్రస్తావించే అవకాశం ఉంటుంది కాబట్టి సమాధానం చెప్పడం కష్టం.

ఇదంతా అతను ఎదగడం చూసి ఓర్వలేని వాళ్లే చేస్తున్న పనులని ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు. లోకేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కోసం స్క్రిప్ట్ రాసే పనిలో బిజీగా ఉన్నాడు. వేసవి తర్వాత షూటింగ్ మొదలుపెట్టేలా ప్లానింగ్ జరుగుతోంది. ఈ టైంలో కేసులు గట్రా అంటే ఏకాగ్రతని దెబ్బ తీసే ప్రయత్నమేనని అభిమానుల కంప్లయింట్. ఏది ఎలా ఉన్నా గత కొన్నేళ్లలో అడల్ట్ కంటెంట్ బాగా పెరిగిపోయింది. కొందరు కల్ట్ మేకింగ్ పేరుతో చూపిస్తున్నారు కానీ వీటి మీద అభ్యంతరాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. మరి లోకేష్ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.