సింగల్ స్క్రీన్ల ప్లానింగులో దిల్ రాజు మాస్

నైజామ్ లో గుంటూరు కారంని విడుదల చేస్తున్న నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఊర మాస్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ లో ఉన్న 96 సింగల్ స్క్రీన్లకు గాను 90 కేవలం గుంటూరు కారం వేసేలా సెట్ చేశారట. మిగిలిన అతి కొన్ని హనుమాన్ తో పాటు మెర్రీ క్రిస్మస్ లాంటి ఇతర చిత్రాలు పంచుకుంటాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ అంత పెద్ద కౌంట్ మహేష్ బాబుకి వచ్చేలా సర్వం సిద్ధమయ్యిందని టాక్. 13, 14 వరసగా మరో మూడు క్రేజీ రిలీజులు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు మొదటి రోజు పిండేసుకుంటే తప్ప రికార్డుల బూజు దులపడం కష్టం.

తెలంగాణ వ్యాప్తంగా గుంటూరు కారంకి ఇదే తరహా స్ట్రాటజీ అమలు పరుస్తారు. తెల్లవారుఝామున 4 గంటల నుంచి షోలు వేసుకునేలా అనుమతుల కోసం అప్లికేషన్ ఆల్రెడీ పెట్టేశారు. సలార్ కి ఇచ్చిన పెంపునే తమకూ ఇమ్మని విన్నపం చేయడంతో దాదాపు నో అనకపోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్ల విషయంలో జగన్ ప్రభుత్వం మరీ కఠినంగా ఉంది కాబట్టి మహా అయితే నలభై లేదా యాభై కన్నా ఎక్కువ వెసులుబాటు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వీలైనంత రెవిన్యూ నైజామ్ నుంచే వస్తుందనేది కాదనలేని వాస్తవం. అందుకే ఇంత పెద్ద స్కెచ్ సిద్ధం చేశారు.

ఇంకో వారం రోజుల్లో రిలీజ్ ఛార్టులు రెడీ అయిపోతాయి. బెనిఫిట్ షో టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ వచ్చేలా కనిపిస్తోంది. కమర్షియల్ సినిమానే అయినప్పటికీ సర్కారు వారి పాట తర్వాత పెద్ద గ్యాప్ వచ్చేయడంతో మహేష్ బాబుని తెరమీద ఊర మాస్ అవతారంలో చూసేందుకు ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. కుర్చీ మడతపెట్టి పాట వచ్చాక ఇది మరింత ఎక్కువయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ తాలూకు వివరాలు తెలియాల్సి ఉంది. మహేష్ ఫ్యామిలీతో పాటు సెలవులకు వెళ్ళాడు. వచ్చేలోగా మొత్తం ప్లాన్ సిద్ధం చేసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటారు.