సలార్ మీద బాహుబలి నిర్మాత కామెంట్లు రైటే

ఎంత బ్లాక్ బస్టర్ అయినా సలార్ ప్రమోషన్లు, యునానిమస్ గా రావాల్సిన రెస్పాన్స్ కొన్ని రాష్ట్రాల్లో తక్కువ స్థాయిలో నమోదు కావడం పట్ల అభిమానుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ దీని గురించి స్పందించారు. ఫిలిం మేకర్స్ తో జరిగిన ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలు ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయి. సలార్ నిర్మాతలు ముందుగానే ఖాన్సార్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసి, అందులోని పాత్రలు చూపించి ఉంటే ఆడియన్స్ కి ఎలాంటి అయోమయం కలిగేది కాదన్నారు. తానైతే ఆ పనే చేసేవాడినని స్పష్టం చేశారు.

అంతే కాదు హిందీ వెర్షన్ ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయకపోవడానికి కారణం డంకీ కాదంటున్నారు. పబ్లిసిటీ సరిగా జరగకపోవడంతో  పాటు ప్రభాస్  మీడియా ముందకు రాకపోవడం వల్ల నార్త్ జనాలు కెజిఎఫ్ దర్శకుడి కాంబినేషన్ లో వచ్చిన ఇంత పెద్ద మూవీని సీరియస్ గా తీసుకోలేదని అన్నారు. ఇవన్నీ లాజిక్ ఉన్నవే. ఎందుకంటే బాహుబలి టైంలో రాజమౌళి కథతో సహా దేన్నీ దాచకుండా ముందే ప్రిపేర్ చేశారు. మాహిష్మతిలో ఏం చూడబోతున్నారనే విషయాల గురించి సమాచారం ఇచ్చారు. కానీ సలార్ కు అలా జరగలేదు. దీంతో సహజంగానే కన్ఫ్యూజన్ రావడంలో ఆశ్చర్యం లేదు.

వీటి సంగతి కాసేపు పక్కనపెడితే సలార్ రెండో వారంలో అడుగు పెట్టక మరో వీకెండ్ ని ఆధీనంలోకి తీసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ మంచి ట్రెండ్ ని సూచిస్తున్నాయి. కొత్త రిలీజులు ఉన్నప్పటికీ మాస్ జనాలకు ఇదే ఫస్ట్ ఛాయస్ గా నిలుస్తోంది. ఉత్తరాదిలో మాత్రం డంకీ వెనుకబడి ఉన్నా సలార్ కు మరీ దూరంలో అయితే లేదు. ప్రభాస్ మరోసారి వెయ్యి కోట్ల మార్కుని అందుకోవడం అంత సులభంగా అయితే అనిపించడం లేదు. కాకపోతే సంక్రాంతి సినిమాలు రావడానికి ఇంకో పదమూడు రోజులు టైం ఉంది కాబట్టి ఆలోగా వీలైనంత ఎక్కువ రాబట్టుకుంటే మైలురాయిని అందుకోవచ్చు కానీ ఈజీ అయితే కాదు.