బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత అందులో నటించిన హీరో తర్వాతి సినిమాలకు డిమాండ్ రావడం సహజం. కానీ ఆనంద్ దేవరకొండకు ఈ పాయింట్ కలిసి రావడం లేదు. గం గం గణేశా టీజర్ వచ్చి నెలలు దాటేసింది. ఇప్పటిదాకా విడుదల తేదీ ప్రకటించలేదు. బిజినెస్ ఆఫర్లు తగినంత స్థాయిలో రాకపోవడమే కాక ఓటిటి డీల్ సెట్ కాకపోవడంతో ఆలస్యం జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. ఆహా ఆసక్తి చూపిస్తున్నప్పటికీ నిర్మాతలు కోరుకున్న రేట్ కాకపోవడంతో పెండింగ్ ఉండిపోయిందట. ఇది క్లియర్ అయితే తప్ప విడుదల తేదీని ఖరారు చేసుకోలేరు.
నిజానికి ఆనంద్ లోని అసలైన నటుడు బయటికి వచ్చింది బేబీతోనే. ఫలితం చూశాక రౌడీ బాయ్ తమ్ముడికి తిరుగు లేదనుకున్నారు. తీరా చూస్తే గం గం గణేష్ పురిటి కష్టాలు చూస్తుంటే కేవలం హీరో ఇమేజ్ మీదే మార్కెట్ జరగడం లేదని అర్థమవుతోంది. ఆనంద్ ఇందులో విభిన్నమైన పాత్ర చేశాడు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించగా చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్ గా సత్యం రాజేష్, వెన్నెల కిషోర్ లాంటి నోటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. ప్యాడింగ్ బాగానే ఉన్నా బజ్ పెంచడంలో మేకర్స్ కిందా మీద పడుతున్నారు.
ఈ సమస్య ఇలాంటి చాలా చిన్న సినిమాలకు తరచుగా వస్తూనే ఉంది. థియేట్రికల్ రిలీజ్ కు వెళ్లేముందు ఓటిటి సేల్ జరగకపోతే ఫలితం వచ్చాక రేట్లు దారుణంగా తగ్గిస్తున్నారు. కంటెంట్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేతులు కాల్చుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. గం గం గణేష్ కి ఎప్పుడు మోక్షం వస్తుందో చూడాలి. బేబీ మేకర్స్ బ్యానర్ లోనే మరో సినిమా చేస్తున్న ఆనంద్ దేవరకొండ మళ్ళీ వైష్ణవి చైతన్యతోనే జోడి కట్టడం ఆసక్తి రేపుతోంది. భగ్న ప్రేమికుడిగా అతని బెస్ట్ చూశాక దర్శకులు రచయితలు ఎక్కువగా అలాంటి కథలనే తీసుకెళ్లడంతో కుర్రాడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates