ఈటీవీ చేతికి సైంధవ్ ఆయుధాలు

ఇప్పుడున్న కాంపిటీషన్ లో శాటిలైట్ ఛానల్స్, ఓటిటిల మనుగడ అంత సులభంగా లేదు. కొత్త కంటెంట్ ఇస్తున్నా ప్రేక్షకులను నిలబెట్టుకోవడం కష్టంగా మారుతున్న తరుణంలో రేసులో వెనుకబడిన ఈటీవీ ఒకేసారి పెద్ద స్ట్రాటజీతో రంగంలో దిగడం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. స్టార్ మా, జెమిని, జీ తెలుగుతో పోల్చుకుంటే కొత్త సినిమాలను కొనడం, ప్రసారం చేసే విషయంలో ఈటీవీ ఎప్పుడో వెనుకబడింది. సీరియళ్లు, న్యూస్, రియాలిటీ షోలతో నిలదొక్కుకుంది కానీ ఈటీవీ విన్ పేరుతో ఓటిటిలో అడుగు పెట్టాక ఈ ఎత్తుగడ సరిపోవడం లేదు. అందుకే గేరు మార్చింది.

వెంకటేష్ సైంధవ్ శాటిలైట్ హక్కులు ఈటీవీ సొంతం చేసుకుందనే వార్త కొద్దిరోజుల క్రితమే లీకయ్యింది. దానికి సంబంధించిన ఈవెంట్ల హక్కులను కూడా కొనుగోలు చేసిందని లేటెస్ట్ అప్డేట్. రేపు హైదరాబాద్ లో జరగబోయే వెంకటేష్ 75 ఈవెంట్ కి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, నాని లాంటి క్రేజీ స్టార్స్ ఎందరో గెస్టులుగా రాబోతున్నారు. సహజంగా దీన్ని చూడాలనే ఎగ్జైట్ మెంట్ ఫ్యాన్స్ లో ఉంటుంది. దీన్ని కొత్త సంవత్సర కానుకగా విన్ ఓటిటి, ఈటీవీ ఛానల్ లో ప్రసారం చేసేందుకు ప్లాన్ చేస్తోందట. దీని వల్ల ఒక్కసారిగా రేటింగ్స్ పెరుగుతాయని ఆశిస్తోంది.

ఇంతేకాదు మీనా, ఖుష్బూ తదితరులతో వెంకీ చేసిన స్పెషల్ ప్రోగ్రాం ఒకటి జనవరి 13 ప్రసారం చేయబోతున్నారు. సైంధవ్ శాటిలైట్ దక్కినా ఈటివికి ఓటిటి రాలేదని సమాచారం. ఇటీవలే బేబీ లాంటి బ్లాక్ బస్టర్ ని ఈటీవీనే ప్రసారం చేసింది. ఇదొక్కటే కాదు ఇంకా కొత్త సినిమాలు చాలానే కొనుగోలు చేసింది. సైంధవ్ కేవలం ప్రారంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో పెద్ద హీరోల శాటిలైట్ హక్కులతో పాటు మెల్లగా ఓటిటిని బలోపేతం చేసే విధంగా ఓటిటి డీల్స్ కూడా చేసుకుంటారని ఇన్ సైడ్ టాక్. జనవరి 13 విడుదల కాబోతున్న సైంధవ్ కి హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.