పవన్ కళ్యాణ్ అభిమానులకు వకీల్ సాబ్ ఒక మంచి జ్ఞాపకం. కరోనా నుంచి కోలుకుంటున్న టైంలో, ఏపీలో టికెట్ రేట్ల నియంత్రణను తట్టుకుని మరీ విజయం సాధించడం స్పెషల్ గా ఫీలవుతారు. మొదటిసారి పవర్ స్టార్ లాయర్ కోటు వేసుకుని కోర్టులో ఇచ్చిన పెర్ఫార్మన్స్, ప్రకాష్ రాజ్ తో తలపడే సన్నివేశాలు బాగా పేలాయి. అయితే దీనికి కొనసాగింపుగా నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ 2 తీస్తారనే ప్రచారం ఆ మధ్య జరిగింది కానీ సరైన కథ లేకపోవడంతో ప్రతిపాదన దగ్గరే ఆగిపోయింది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఎస్విసి బ్యానర్ లోనే నితిన్ తో తమ్ముడు తీసే పనిలో బిజీ అయ్యాడు.
సరిగ్గా వకీల్ సాబ్ సీక్వెల్ కోసం సరిపోయే సినిమా ఒకటి మలయాళంలో వచ్చింది. అదే నేరు. మోహన్ లాల్ హీరోగా దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా మల్లువుడ్ లో సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది. సలార్ నుంచి పోటీ ఉన్నా సరే తట్టుకుని మరీ నిలబడింది. నిజానికీ సినిమా మీద వెంకటేష్ ఆసక్తి చూపించారనే టాక్ వచ్చింది కానీ సినిమా చూసిన వాళ్ళు మాత్రం వకీల్ సాబ్ 2కి బాగా సరిపోతుందని భావిస్తున్నారు. కళ్ళు లేని ఒక మధ్య తరగతి యువతిని మంత్రి కొడుకు రేప్ చేస్తే హీరో ఎలా పోరాడి గెలిపించాడనే పాయింట్ మీద ఇది నడుస్తుంది.
కేవలం రెండు ఇళ్ళు, కోర్ట్ రూమ్ సెటప్ లోనే జీతూ జోసెఫ్ రెండున్నర గంటల కంటెంట్ విసుగు రాకుండా నడిపించాడు. రెమ్యునరేషన్లు తప్ప ప్రొడక్షన్ పరంగా ఎంత మాత్రం ఖర్చు లేని సబ్జెక్టిది. ఒకవేళ పవన్ వేగంగా ఏదైనా సినిమా చేయాలనుకుంటే బెస్ట్ ఛాయసవుతుంది. నేరులో హీరోయిన్ ఉండదు. పాటలు అసలే లేవు. కావాలంటే కొంత కమర్షియల్ టచ్ ఇవ్వొచ్చు కానీ టైటిల్స్ నుంచి చివరి దాకా సీరియస్ టోన్ లో సాగుతుంది. ఇప్పటికే ఒక రీమేక్ ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాణంలో ఉంది. ఒకవేళ భీమ్లా నాయక్ తరహాలో ఇది కూడా నచ్చిందంటే నేరు కాస్తా వకీల్ సీక్వెల్ కావొచ్చు. చూద్దాం.