నాని లాంటి పెద్ద హీరో వుండడంతో ‘వి’ చిత్రానికి అమెజాన్ అంతటి రేట్ ఇచ్చింది కానీ మిగతా సినిమాలకు అలా ఓటిటిల నుంచి సూపర్ డీల్స్ రావట్లేదు. థియేటర్లు తెరిచినపుడు అక్కడ ప్రదర్శించుకోవడానికీ, అలాగే శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముకోవడానికి అమెజాన్ ఓకే చెప్పింది. అందుకే వి లాంటి భారీ సినిమాకు ఓటిటి రిలీజ్ సాధ్యమయింది. మిగతా సినిమాలకు ఓటిటి కంపెనీలు ఆఫర్ చేసే రేట్లు ఎంతమాత్రం గిట్టుబాటు కాకనే ఇన్నాళ్లూ ఎవరూ ముందుకు రాలేదు.
సరిగ్గా ఇక్కడే జీ 5 సంస్థ వెరైటీ ఆఫర్‍తో ముందుకొచ్చింది. ఓటిటి లేదు, శాటిలైట్ లేదు, హిందీ డబ్బింగ్ లేదు… మొత్తంగా అన్ని హక్కులూ వాళ్లకే ఇచ్చేసేలా రేటు చెప్పాలని నిర్మాతలకు చెప్పింది. దాంతో నిర్మాతలు తమ ఖర్చులు పోను కాస్త లాభం వేసుకుని రేట్ మాట్లాడుకున్నారు. దీని వల్ల రేపు థియేటర్లలో విడుదల చేసుకోవాలన్నా, లేదా ఈ సినిమాలను వేరే భాషల్లోకి అనువదించుకోవాలన్నా, పే పర్ వ్యూ పద్ధతిలో స్ట్రీమింగ్ చేసుకోవాలన్నా అన్ని హక్కులూ జీ సంస్థ చేతిలోనే వుంటాయన్నమాట.
జీ ఇలాంటి ఆఫర్‍తో రాకపోయినట్టయితే చాలా సినిమాల డిజిటల్ రిలీజ్‍కి వీలు పడేది కాదు. నెట్‍ఫ్లిక్స్, అమెజాన్ ఈ తరహా డీల్స్ చేసుకునే వీల్లేదు కనుక వాళ్లు ఈ జోన్‍లోకి రాలేకపోయారు. ఈ ప్లాట్‍ఫామ్‍పై తమ జెండా ఎగరాలంటే ఇదే బెస్ట్ అని జీ5 తెలుగు సినిమాలతోనే ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసారు.