‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర చేయడమే కాక.. ‘ఓలమ్మీ తిక్కరేగిందా’ పాట కూడా పాడి మెప్పించింది మమత. దాంతో పాటు ‘రాఖీ రాఖీ’, ‘ఆకలేస్తే అన్నం పెడతా’, ‘36 24 36’ లాంటి పాటలతో ఆమె ఆశ్చర్యపరిచింది. ఇంత అందమైన హీరోయిన్.. సింగర్ కూడా కావడం విశేషమే.
తెలుగులో ఆపై కృష్ణార్జున, విక్టరీ, హోమం, చింతకాయల రవి.. ఇలా చాలా సినిమాలే చేసింది మమత. ఐతే కెరీర్ మంచి ఊపులో ఉండగానే, 27 ఏళ్ల వయసుకే ప్రజీత్ పద్మనాభన్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది మమత. కానీ అంతలోనే ఆమె క్యాన్సర్ బారిన పడడం.. పెళ్లయిన ఏడాదికే విడాకులు తీసుకోవడం.. ఇలా ఏడాదిలో తన జీవితంలో చాలా జరిగిపోయాయి. క్యాన్సర్ కారణంగానే విడాకులు అయ్యాయనే వార్తలు కూడా వచ్చాయి.
ఐతే తర్వాత క్యాన్సర్ నుంచి కోలుకోవడమే కాక తిరిగి సినిమాల్లోనూ నటించి తన మనో ధైర్యాన్ని చాటింది మమత. ఇటీవలే ఆమెకు అవకాశాలు తగ్గినా.. ఇండస్ట్రీ నుంచి అయితే వెళ్లిపోలేదు. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్న మమత.. మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. తనకు తిరిగి ప్రేమపై మనసు మళ్లిందని.. తనను అర్థంచేసుకునే వ్యక్తి తారసపడితే వైవాహిక జీవితంలోకి వెళ్లాలనుకుంటున్నానని చెప్పింది.
ఐతే మధ్యలో తనకు ఇండస్ట్రీలో ఒక చేదు ప్రేమ అనుభవం ఎదురైనట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించింది. ఒక నటుడితో డేటింగ్ చేశానని.. కానీ అతడికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందని తెలిసి తన మనసు ముక్కలైందని మమత తెలిపింది. ఇలా ఒక అమ్మాయి నమ్మకాన్ని బద్దలు కొట్టడానికి ఎలా మనసు వస్తుందో అని ఆవేదన వ్యక్తం చేసిన మమత.. ఈ విషయం గురించి ఆ వ్యక్తిని అడిగితే చాలా తేలిగ్గా మాట్లాడినట్లు వెల్లడించింది. ఆ ఉదంతాన్ని తాను జీర్ణించుకోలేకపోయానని.. ఇప్పుడు మళ్లీ ప్రేమ, పెళ్లి మీద ఆసక్తి కలిగినట్లు మమత తెలిపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates