125 మిలియన్ డాలర్లు ముంచేసిన నీటి మనిషి

 భారీ బడ్జెట్ తో తీసి డిజాస్టర్లుగా మిగిలిన సినిమాలు మనం చూస్తుంటాం. కాకపోతే మన స్కేల్ వందల కోట్ల దగ్గరే పరిమితంగా ఉంటుంది  కాబట్టి నష్టం కూడా అంతే మోతాదులో కనిపిస్తుంది. కానీ హాలీవుడ్ మూవీస్ లెక్కలు వేరుగా ఉంటాయి. బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం తేడా కొట్టినా డ్యామేజ్ ఊహించుకోలేనంత పెద్దగా ఉంటుంది. మొన్న గురువారం రిలీజైన ఆక్వామెన్ ది ఫాలెన్ కింగ్ డం దారుణంగా బోల్తా కొట్టడమే కాదు ఫైనల్ రన్ ముగిసే లోపు నిర్మాతలకు ఏకంగా 125 మిలియన్ డాలర్ల నష్టాన్ని మిగిల్చబోతోందని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.

ఆక్వామెన్ 2కి పెట్టిన బడ్జెట్ సుమారు 215 మిలియన్ డాలర్లు. ఇప్పటిదాకా వసూలైన మొత్తం 120 మిలియన్ డాలర్ల లోపే ఉంది. కనీసం బ్రేక్ ఈవెన్ అయితే చాలనుకుంటే ఇప్పుడీ నెంబర్లు చూసి బయ్యర్లు ఖంగారు పడుతున్నారు. ఇండియాలో సలార్, డంకీ వల్ల సముద్ర పుత్రుడికి పెద్ద దెబ్బ పడింది. ప్రభాస్ మేనియా ముందు నిలవడం కష్టమైపోయింది. చెప్పుకోదగ్గ స్క్రీన్లు దక్కినప్పటికీ రెండో రోజు నుంచే చాలా చోట్ల ఆక్వామెన్ తీసేసి సలార్ షోలు వేయడం కనిపించింది. త్రీడి స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత ప్రచారం చేసుకున్నా లాభం లేకపోయింది. అంతగా తిరస్కరించారు.

అయినా ఎంత క్రేజ్ ఉంటే మాత్రం కేవలం టైటిల్, హీరో ఇమేజ్, విజువల్ ఎఫెక్ట్స్ ని నమ్ముకుని కథని కాకరకాయలా తీసి పారేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయి. హాలీవుడ్డే కాదు ఏ వుడ్డుకైనా ఇవి వర్తిస్తాయి. గత కొన్నేళ్లలో మన దేశంలో చెప్పుకోదగ్గ పెర్ఫార్మ్ చేసిన సీక్వెల్స్ అవతార్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, జురాసిక్ పార్క్ మాత్రమే. మిగిలినవి టపా కట్టేశాయి. ఆ మధ్య వచ్చిన ఇండియానా జోన్స్ డయల్ ఫర్ డెస్టినీ సైతం నో అనిపించేసుకుంది. ఆక్వామెన్ మొదటి భాగం అయిదేళ్ల క్రితం కెజిఎఫ్ పోటీని తట్టుకుని మన దేశంలో మంచి వసూళ్లు రాబట్టుకుంది కానీ ఈసారి సాధ్యపడలేదు.