ఎప్పుడో ఆరేళ్ళ క్రితం కాటమరాయుడు ఫ్లాప్ అయ్యాక హీరోయిన్ శృతి హాసన్ ఇక తెలుగులో కనిపించదనే అందరూ అనుకున్నారు. గబ్బర్ సింగ్, శ్రీమంతుడు నాటి ఫామ్ లేకపోవడంతో పాటు వరస డిజాస్టర్లు అవకాశాలను తగ్గించాయి. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అనిపించుకుని తర్వాత గోల్డెన్ హ్యాండ్ గా మారిపోయి కొంత కాలం స్టార్ స్టేటస్ అనుభవించి మాయమైపోయింది. కట్ చేస్తే క్రాక్ బ్లాక్ బస్టర్ తర్వాత శృతి హాసన్ మళ్ళీ టాలీవుడ్ దర్శక నిర్మాతలకు లక్కీ గర్ల్ గా మారిపోతోంది. దాని తర్వాత చేసిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విజయం సాధించడం అదృష్టాన్ని ఇంకాస్త పెంచింది.
అసలు విశేషమంతా 2023లో జరిగింది. సంక్రాంతికి ఒకే సమయంలో చిరంజీవి, బాలకృష్ణల సరసన నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండూ ఘనవిజయం సాధించడం ఒక ఎత్తయితే ప్రభాస్ తో మొదటిసారి జట్టు కట్టిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సైతం అదే బాటలో రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. ఊరికే ఒక పాటలో అలా మెరిసిన హాయ్ నాన్న కూడా బాక్సాఫీస్ సక్సెస్ కావడం గమనించాల్సిన విషయం. నెక్స్ట్ అడవి శేష్ లాంటి హ్యాపెనింగ్ హీరోతో డెకాయిట్ లాంటి లవ్ రివెంజ్ మూవీలో ఆఫర్ దక్కించుకోవడం తెలుగులో బిజీ హీరోయిన్ గా మార్చేస్తోంది.
ఒకపక్క టాప్ డిమాండ్ ఉన్న శ్రీలీల ఈ సంవత్సరం మూడు డిజాస్టర్లు చవి చూసింది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లు బోల్తా కొట్టగా భగవంత్ కేసరి మాత్రమే ఊరట కలిగించింది. పూజా హెగ్డే అవుట్ అఫ్ ఫామ్ అయిపోయింది. రష్మిక మందన్న ఫోకస్ ఎక్కువగా బాలీవుడ్ మీద ఉంది. ఇలాంటి టైంలో ఎవరికీ సాధ్యం కానట్టు శృతి హాసన్ ఏకంగా మూడు హిట్లు అందుకోవడం చిన్న విషయం కాదు. దెబ్బకు మరిన్ని ఆఫర్లు పలకరిస్తున్నాయట. సీనియర్ హీరోలతో ఆఫర్లు వచ్చినా అంగీకరిస్తున్న శృతి హాసన్ సలార్ 2లో మరింత ప్రాధాన్యం దక్కించుకోనుంది.