సలార్, డంకీ లాంటి భారీ సినిమాలకు కేవలం రెండు వారాల ముందు, యానిమల్ సునామి మొదలైన ఏడు రోజులకు హాయ్ నాన్న విడుదలని ప్రకటించినప్పుడు ట్రేడ్ లోనూ కొన్ని సందేహాలు లేకపోలేదు. ఇంత ఎమోషనల్ డ్రామా కమర్షియల్ గా వర్కౌట్ కావడం గురించి ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అందరి ఊహాగానాలకు సంపూర్ణంగా చెక్ పెడుతూ హాయ్ నాన్న బాక్సాఫీస్ దగ్గర గెలిచేశాడు. ఇంకా సెకండ్ వీక్ పూర్తి కాకుండానే బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా పెట్టుకున్న 28 కోట్లను షేర్ రూపంలో దాటేశాడు. నిన్న ఈ రోజు బుకింగ్ ట్రెండ్స్ చాలా బాగుండటం శుభ సంకేతం.
గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షో యాప్ లో హాయ్ నాన్న టికెట్లు అడ్వాన్స్ గా లక్షకు పైగా అమ్ముడుపోవడం దీనికి సాక్ష్యం. హైదరాబాద్ లోనే సండే ముందస్తు గ్రాస్ కోటి రూపాయలు దాటడం అంటే మాటలు కాదు. అపోజిషన్ గా వచ్చిన ఎక్స్ ట్రాడినరి మ్యాన్ రెండో రోజుకే వాష్ అవుట్ కాగా, యానిమల్ వల్ల తలెత్తిన థియేటర్ల కొరతను తట్టుకుని మరీ హాయ్ నాన్న కుటుంబ ప్రేక్షకులను రప్పించగలిగాడు. ఓవర్సీస్ 1.6 మిలియన్ డాలర్లు దాటేసిన నాని సలార్ వచ్చే లోపు 2 మార్కు అందుకుంటాడని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. ట్రెండ్ చూస్తే సాధ్యమే అనిపిస్తోంది.
డిసెంబర్ లాంటి ప్రతికూల నెలలో ఈ ఫీట్ సాధించడం ద్వారా హాయ్ నాన్న మరోసారి ఎమోషనల్ కథలకు నమ్మకం ఇచ్చాడు. దసరా లాంటి ఊర మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇంత హెవీ కథతో రావడం పట్ల నాని రిస్క్ తీసుకున్నాడనే అందరికీ అనిపించింది. కానీ నాని లెక్కలు వేరుగా ఉన్నాయి. పాప కియారా, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో ముడిపడిన విరాజ్ భావోద్వేగాలు ఆడియన్స్ ని కట్టి పడేస్తాయని నమ్ముతూ వచ్చాడు. ఇప్పుడదే నిజమయ్యింది. ఇవాళ రామానాయుడు స్టూడియోస్ లో టీమ్ ప్రత్యేకంగా సెలబ్రేషన్ ఈవెంట్ చేయబోతోంది. మరి ఆనందం పంచుకోకపోతే ఎలా.