నారా రోహిత్ హీరోగా టీవీ5 మూర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆ మధ్య ప్రతినిధి 2 ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎలాంటి ప్రోగ్రెస్, షూటింగ్ అప్డేట్స్ ఇవ్వకుండా వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. ఒకదశలో ఇది ఆగిపోయిందేమోననే అనుమానం కూడా వచ్చింది. దీని వెనుక పెద్ద స్ట్రాటజీ ఉందని వినికిడి. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కి ఉంది. జనసేన టిడిపి పొత్తు తర్వాత పరిణామాలు కాస్త నెమ్మదించినట్టు అనిపించినా జనవరి నుంచి ఒక్కసారిగా గేరు మార్చి వేగవంతం చేయబోతున్నారు. ఈ సమాచారం రోహిత్, మూర్తికి తెలుసు.
అందుకే కూలంకుషంగా ఇవన్నీ గమనించి అవసరానికి అనుగుణంగా స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నారట. రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఈ నెల 29 విడుదల కానుంది. పూర్తిగా జగన్ ని మోయడమే లక్ష్యంగా పెట్టుకుని, చంద్రబాబు పవన్ లను టార్గెట్ గా చేసుకున్న విషయం ట్రైలర్ లోనే అర్థమైపోయింది. ముల్లుని ముల్లుతోనే తీయాలనే పద్ధతిలో దీనికి కౌంటర్ గా ప్రతినిధి 2లో ఏఏ అంశాలు జోడించాలనేది సినిమా చూశాక చర్చించుకోబోతున్నారు. నిజానికి వర్మ వ్యూహంని ప్రేక్షకులు అంతగా పట్టించుకునే పరిస్థితిలో లేరు. థియేటర్ రిలీజ్ చేసినా వసూళ్లు పెద్దగా రావు.
కానీ అందులో సన్నివేశాలు, విజువల్స్ ని ప్రచారం టైంలో బాగా వాడుకుంటారు. వాటికి ధీటుగా ప్రతినిధి 2 ఉంటే కనక సందర్భోచితంగా టిడిపికి ఉపయోగపడతాయి. వ్యూహం 2 జనవరి 25 విడుదలవుతుంది. అదే డేట్ కి రోహిత్ తన సినిమాని దింపబోతున్నాడు. ఒకవేళ కొంచెం ఆలస్యమైతే ఫిబ్రవరిలో వచ్చే యాత్ర 2 చూశాక దాన్ని బట్టి కుడా కొన్ని చివరి నిమిషం మార్పులు చేసుకునే విషయాన్ని కొట్టిపారేయలేం. ప్రస్తుతానికి ఎలాంటి హడావిడి లేకుండా మూర్తి టీమ్ చిత్రీకరణలో బిజీగా ఉంది. జనవరి మొదటి వారంలో ప్రమోషన్లను ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది.