సలార్ నిడివి గురించి నో టెన్షన్

డిసెంబర్ 22 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణకు త్వరలో ముగింపు రాబోతోంది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. నిడివి విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రాజీ పడలేదు. ఫైనల్ కట్ 2 గంటల 55 నిమిషాల 22 సెకండ్లకు లాక్ చేశారని సమాచారం. కంటెంట్ బలంగా ఉంటే ఆడియన్స్ లెన్త్ ని ఏ మాత్రం పట్టించుకోరని యానిమల్ ఋజువు చేశాక నిర్మాతలకు ధైర్యం వచ్చేసింది. ఈ లెక్కన మూడు గంటల లోపు ఉన్నవి ఇకపై సాధారణ నిడివి కింద పరిగణించాల్సి ఉంటుంది.

ఇక సలార్ ప్రమోషన్లకు తెరతీయాలి. చేతిలో ఉన్న పన్నెండు రోజుల్లో విపరీతమైన పబ్లిసిటీ చేసేలా కనిపించడం లేదు కానీ కొత్త ట్రైలర్ తో అంచనాలు అమాంతం పెంచేస్తారనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. మూడు నిమిషాల నలభై సెకండ్ల కొత్త వెర్షన్ లో పూర్తిగా ప్రభాస్, యాక్షన్ ఎపిసోడ్లను హైలైట్ చేసేలా ఎడిట్ చేయించారట. ఐమాక్స్ ప్రింట్ కూడా సిద్ధమైపోవడంతో తెరమీద గత కొన్నేళ్లలో ఎప్పుడూ చూడని భారీ యాక్షన్ డ్రామాకు రంగం సిద్ధం కాబోతోంది. ప్రస్తుతం కల్కి సెట్స్ లో ఉన్న ప్రభాస్ సలార్ ఇంటర్వ్యూలలో పాల్గొనేది లేనిది రేపో ఎల్లుండో తేలనుంది.

అనుకున్నట్టే ఇందులో ప్రభాస్ ఎంట్రీ కాస్త లేట్ గానే ఉంటుందని ఇన్ సైడ్ రిపోర్ట్. అరగంట తర్వాత రెబెల్ స్టార్ ఇంట్రో వస్తుందట. దానికన్నా ముందు ఖన్సార్ ప్రపంచాన్ని పరిచయం చేయడం, జగపతిబాబు-పృథ్విరాజ్ సుకుమారన్ ల ఎపిసోడ్ తో ఫ్యాన్స్ కాస్త ఓపిగ్గా చూడాల్సిందే. డిసెంబర్ ప్రారంభంలో యానిమల్ ఇచ్చిన జోష్ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాల్సిన బాధ్యత సలార్ మీద ఉంది. రన్బీర్ కపూరే ఎనిమిది రోజులు ఆరు వందల కోట్లు దాటించినప్పుడు ప్రభాస్ దాన్ని ఒక్క వారంలోపే బద్దలు కొట్టేయాలి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా అదేమంత అసాధ్యమైతే కాదు.