మొదటి రోజు వసూళ్లలో బాక్సాఫీస్ మృగం

డిసెంబర్ నెలలో మాములుగా ఎంత పెద్ద హీరో సినిమా అయినా భీభత్సమైన వసూళ్లు రాబట్టుకోవడం కష్టం. అందుకే ఒకవేళ ప్లాన్ చేసుకున్నా క్రిస్మస్ టైంలో చూసుకుంటారు కానీ మొదటి వారం కాదు. అయినా సరే యానిమల్ ఈ సెంటిమెంట్ బ్రేక్ చేసి నిన్న వరల్డ్ వైడ్ భారీ ఓపెనింగ్ దక్కించుకుని ఔరా అనిపించుకుంది. టైటిల్ కి న్యాయం చేస్తూ వసూళ్ల మృగం పేరుకి సార్థకత చేకూరుస్తోంది. టీమ్ అధికారికంగా విడుదల చేసిన ప్రకారం వరల్డ్ వైడ్ గ్రాస్ 116 కోట్లు రావడమంటే మాటలు కాదు. అందులోనూ ప్రతికూల పరిస్థితులు, సామ్ బహదూర్ లాంటి పోటీని పెట్టుకుని.

కేవలం ఇండియానే పరిగణలోకి తీసుకున్నా 61 కోట్లకు రావడమంటే సెన్సేషన్ కన్నా ఎక్కువ. ఒక్క హిందీ వెర్షనే హాఫ్ సెంచరీ దాటడం సంచలనం. తర్వాత అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచి 10 కొట్లకు దగ్గరగా వచ్చినట్టు ట్రేడ్ టాక్. పదిహేను కోట్లకు కొన్న దిల్ రాజు పంట పండినట్టేనని బయ్యర్ల మాట. విచిత్రంగా తమిళం, కన్నడ, మలయాళం నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదు. ఈ మూడు రాష్ట్రాలకు కలిపి 60 లక్షల లోపే రావడం గమనార్హం. ఓవర్సీస్ లో చాలా సులభంగా రెండున్నర మిలియన్లు దాటేసిన యానిమల్ క్లోజింగ్ ఫిగర్స్ షాకింగ్ ఉండబోతున్నాయి.

ఈ దూకుడు కొనసాగడం మీదే యానిమల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. శని ఆదివారాలు కూడా ఉదయం ఎర్లీ షోలు వేయడం ట్రెండ్ ని సూచిస్తోంది. కొన్ని చోట్ల జవాన్ కు దగ్గరగా వెళ్లడం, క్రాస్ చేయడం అనూహ్యం. అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ చాలా కేంద్రాల సింగల్ స్క్రీన్లలో పద్దెనిమిది లోపు టీనేజ్ కుర్రకారు థియేటర్ల దగ్గర కనిపిస్తున్నారు. మల్టీప్లెక్సుల్లో వీళ్ళను అనుమతించనప్పటికీ యూత్ ఆడియన్స్, మాస్ అండతో భారీ ఫిగర్లు నమోదవుతున్నాయి. ఇవాళ 70 కోట్ల దాకా అంచనా ఉంది. మొదటి వారం పూర్తయ్యేలోపే డబుల్ సెంచరీ ఖాయమేనని చెప్పొచ్చు.