ఊహించని నెగిటివిటీకి కారణం ఎవరు

నిన్న రాత్రి భారీ అంచనాల మధ్య విడుదలైన సలార్ ట్రైలర్ మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ జోరుగానే ఉంది. విజువల్స్ కెజిఎఫ్ – కబ్జాలను గుర్తు చేయడం, కోలార్ బంగారు గనుల స్థానంలో ఖన్సార్ అనే నగరాన్ని సృష్టించడం లాంటి అంశాల మీద పెద్ద చర్చ జరుగుతోంది. మూడున్నర నిమిషాలకు దగ్గరగా ఉన్న వీడియోలో ప్రభాస్ ని ముప్పాతిక ట్రైలర్ అయ్యాక రివీల్ చేయడం మైనస్ అయ్యింది. ఒకవేళ అసలు సినిమాలో కూడా లేట్ ఎంట్రీ ఉంటుందేమోననే అనుమానాలు మొదలయ్యాయి. పృథ్విరాజ్ సుకుమారన్ పరిచయానికి ఎక్కువ సమయం తీసుకోవడం ఇంకో ప్రతికూలాంశం.

దీనికి బాధ్యుడు ప్రశాంత్ నీలా అంటే మొత్తం ఆయన పర్యవేక్షణలోనే జరుగుతుంది కాబట్టి కాదని అనలేం. కావాలని ప్రభాస్ ని అండర్ ప్లేగా చూపించి అంచనాలు తగ్గించి థియేటర్ లో సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేశారా అంటే దానికి సమాధానం రిలీజ్ రోజు మాత్రమే దొరుకుతుంది. అయినా ఆల్రెడీ హైప్ ఆకాశంలో ఉన్నప్పుడు వాటిని కొత్తగా పెంచడమో తగ్గించడమో చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాల్సింది. సోషల్ మీడియా డివైడ్ టాక్ చూసి అటు పక్క బాలీవుడ్ మీడియా సైతం డంకీ కోసం సలార్ ని టార్గెట్ చేసుకోవడం మొదలుపెట్టింది.

కేవలం దీనివల్ల ఓపెనింగ్స్ తగ్గుతాయనో బిజినెస్ డిమాండ్ ప్రభావితం చెందుతుందనో చెప్పడానికి లేదు. ఎందుకంటే సలార్ వ్యాపారం ఎప్పుడో అయిపోయింది. ఓవర్సీస్ నుంచి హైదరాబాద్ దాకా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లు అన్నీ లాక్ అయ్యాయి. ఒక్క నార్త్ కు సంబంధించిన వ్యవహారాలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. డంకీతో స్క్రీన్లు పంచుకోవాల్సిన నేపథ్యంలో పంపిణీదారులతో చర్చలు జరుగుతున్నాయి. ఇన్ సైడ్ ప్రకారం సలార్ టీమ్ కేవలం ప్రభాస్ ని మాత్రమే హైలైట్ చేసేలా ఇంకో ట్రైలర్ సిద్ధం చేసిందట. డిసెంబర్ రెండో వారంలో దాన్ని విడుదల చేయొచ్చని వినికిడి.