గుట్టుచప్పుడు కాకుండా సలార్ ట్రైలర్

అందరూ యానిమల్ ఎలా ఉండబోతోందని దాని గురించే మాట్లాడుకుంటున్నారు కానీ రేపు సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు సలార్ ట్రైలర్ విడుదలవుతోందనే విషయాన్ని కొందరు మర్చిపోతున్నారు. నిజానికి సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. హోంబాలే ఫిలింస్ ఈ మధ్య తరచు ప్రమోషన్ ట్వీట్లు పెడుతోంది కానీ అవి ప్రభాస్ రేంజ్ లో లేవని అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఇవాళ పోలింగ్ డేని మినహాయిస్తే రిలీజ్ కు కేవలం 21 రోజులు మాత్రమే ఉంది. అంటే మూడు వారాల వ్యవధిలోనే పబ్లిసిటీ మొత్తం జరిగిపోవాలి.

అంతర్గతంగా సలార్ టీమ్ నుంచి వినిపిస్తున్న టాక్ ఏంటంటే సైలెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేసేసి దాన్నుంచి వచ్చే స్పందనతో ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం సినిమాల పరంగా దేశమంతా యానిమల్ ఫీవరే కనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్పినా జనాలకు ఎక్కదు. అందుకే ఓ నాలుగైదు షోలు పడి టాక్ వచ్చేశాక, అప్పుడు సలార్ సెగలు రుచి చూపించాలని నిర్ణయించుకున్నారట. యానిమల్ హైప్ ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఏదైనా ఈవెంట్ చేస్తే బాగుంటుంది కానీ ఆ సూచనలు లేవు.

బిజినెస్ ఎలాగూ జరిగిపోయింది కానీ సలార్ అంచనాల భారం ట్రైలర్ మీద చాలా తీవ్రంగా ఉంది. కట్ చాలా అద్భుతంగా వచ్చిందని, ఒక్కసారిగా బజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని వర్క్ చేస్తున్న వాళ్ళ నుంచి వినిపిస్తున్న కామెంట్. కెజిఎఫ్ తో దీనికి ఎలాంటి సంబంధం లేదని దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా క్లారిటీ ఇచ్చేశాడు కాబట్టి ఎలాంటి విజువల్స్ ని శాంపిల్ గా చూపిస్తారనే యాంగ్జైటి ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది. అన్ని భాషలకు ఒకే ట్రైలర్ ఇచ్చి సెట్టింగ్స్ లో ఆడియో ఎంచుకునే ఆప్షన్ ఇవ్వొచ్చని తెలిసింది. అలా అయితేనే వ్యూస్ పరంగా భారీ రికార్డులు నమోదయ్యే ఛాన్స్ ఉంది.