డిసెంబర్ 1 యానిమల్ ఒకటే కాదు

ఎవరినైనా ఈ వారం ఏ సినిమాకు వెళ్తున్నావని అడిగితే దాదాపు అందరి నుంచి యానిమల్ అనే సమాధానమే వస్తోంది. నిజానికి వేరే కొత్త రిలీజులు లేవా అంటే ఉన్నాయి కానీ అవి తక్కువ బడ్జెట్ తో రూపొందినవి కావడంతో టాక్ చాలా కీలకం కానుంది. సుడిగాలి సుధీర్ నటించిన ‘కాలింగ్ సహస్ర’కు ఉన్నంతలో కాసిన్ని ప్రమోషన్లు చేశారు. గాలోడుకి మాస్ అండతో గట్టెక్కిన ఈ స్టార్ యాంకర్ ఈసారి క్రైమ్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. ట్రైలర్ లో కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు కాబట్టి దాని ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. ఓపెనింగ్స్ రావడమే కీలకం.

‘అథర్వ’ అనే మరో థ్రిల్లర్ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంటగా నటించగా మహేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. టీమ్ నమ్మకంగా ఉంది. ‘ఉపేంద్ర గాడి అడ్డా’ అనే మరో చిన్న చిత్రం బరిలో ఉంది. ఈ మూడు యానిమల్ సునామిని తట్టుకోవడం సులభం కాదు. ఎందుకంటే ప్రతి సెంటర్లో అదనపు షోలతో యానిమల్ బయ్యర్ల ప్లానింగ్ మాములుగా లేదు. హిందీ రాని ఆడియన్స్ కోసం తెలుగు డబ్బింగ్ ఉండటంతో దాని క్రేజ్ కూడా ఎక్కువగానే ఉంది. ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా బజ్ పెరిగిపోవడంతో మొదటి రోజు ఫిగర్లు షాక్ ఇవ్వడం ఖాయమే.

అందుకే నయనతార ‘అన్నపూరణి’ తెలుగు వెర్షన్ డిసెంబర్ 1 రిలీజ్ చేయడం లేదు. కేవలం తమిళంకు మాత్రమే పరిమితం చేశారు. రన్బీర్ కపూర్ సందీప్ వంగాల ర్యాంపేజ్ ముందే ఊహించారు కాబోలు ఇతర బాలీవుడ్ నిర్మాతలు సాహసం చేయలేదు. విక్కీ కౌశల్ ‘సామ్ బహదూర్’ మాత్రమే రిస్క్ చేసి క్లాష్ కి సై అంటోంది కానీ ఆ నిర్ణయం ఎంత తొందరపాటో అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేస్తున్నాయి. దీన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం హిందీ సినిమాకే తెలుగు సబ్ టైటిల్స్ వేసే కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. ఏనుగు లాంటి యానిమల్ ని ఢీ కొట్టి ఎవరైనా గెలుస్తారేమో చూడాలి.