విశ్వ‌క్ మాట వెన‌క్కి తీసుకున్నాడండోయ్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ త‌న కొత్త చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి రిలీజ్ డేట్ విష‌య‌మై ఆ మ‌ధ్య పెట్టిన సోష‌ల్ మీడియా పోస్టు ఎంత సంచ‌ల‌నం రేపిందో తెలిసిందే. బ్యాగ్రౌండ్ లేద‌ని త‌న‌ను తొక్కేయాల‌ని చూస్తున్న‌ట్లుగా మాట్లాడిన విశ్వ‌క్.. ఈ సినిమాను డిసెంబ‌రులో రిలీజ్ చేయ‌క‌పోతే తాను ప్ర‌మోష‌న్ల‌కు రానంటూ నిర్మాత‌కు అల్టిమేటం విధించాడు. ఆ త‌ర్వాత అత‌ను సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌లేదు.

ఈలోపు నిర్మాత నాగ‌వంశీ డ్యామేజ్ కంట్రోల్‌కు ప్ర‌య‌త్నించాడు. సినిమా ఇంకా రెడీ కాలేద‌ని… రిలీజ్ డేట్ ఖ‌రారు చేయ‌లేద‌ని అత‌న‌న్నాడు. డిసెంబ‌రు 30 డేట్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు కూడా చెప్పాడు. క‌ట్ చేస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రికి ఇప్పుడు కొత్త డేట్ వ‌చ్చింది. వేస‌వి కానుక‌గా మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

త‌న సినిమా కొత్త డేట్‌ను స్వ‌యంగా విశ్వ‌క్‌సేనే ఈ రోజు ప్ర‌క‌టించాడు. డిసెంబ‌రు రిలీజ్ లేకుంటే సినిమాను ప్ర‌మోట్ చేయ‌నన్న విశ్వ‌క్.. ఆ మాట‌ను వెన‌క్కి తీసుకుని త‌నే స్వ‌యంగా మార్చి రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఐతే ఆ రోజు విశ్వ‌క్ ఆవేశం, ఆవేద‌న అర్థం చేసుకోద‌గ్గ‌వే. త‌ర్వాత టీం అంతా అత‌డిని క‌న్విన్స్ చేసి ఉండొచ్చు. అయినా డిసెంబ‌రు 8 డేట్‌ను సినిమా అందుకునే స్థితిలో లేద‌న్న‌ది అంత‌ర్గ‌త వ‌ర్గాల స‌మాచారం. అందుకే వాయిదా వేసి.. సేఫ్ డేట్ ఎంచుకున్నారు.

ఇక తాపీగా సినిమాను రెడీ చేసి ప్ర‌మోష‌న్లు చేసుకుని రిలీజ్ చేసుకోవ‌చ్చు. మార్చి 8 అంటే కొంచెం రిస్కీ డేటే. అప్ప‌టికి స్టూడెంట్స్‌కి ప‌రీక్ష‌ల టైం న‌డుస్తుంటుంది. అయినా గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి టీం అర్లీ స‌మ్మ‌ర్లో సినిమాను రిలీజ్ చేయ‌డానికి రెడీ అయిపోయింది. లిరిసిస్ట్ ట‌ర్న్డ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌చైత‌న్య ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.